కోలీవుడ్ స్టార్ హీరో సూర్య..తెలుగు వారికి సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై చక్కటి విజయం సాధిస్తాయి. ‘ఆకాశమే నీ హద్దురా, జై భీమ్’ తదితర చిత్రాలు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ సినిమాలో సూర్య నటనకు చక్కటి ప్రశంసలు దక్కాయి.
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన ఈ కోర్టు డ్రామా..గతేడాది నవంబర్ లో OTTఅమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక కలసి తమ సొంత నిర్మాణ సంస్థపై ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు. కాగా, ఈ పిక్చర్ లోని క్యాలెండర్ సీన్‌పై గతంలోనే వివాదం చెలరేగింది. తాజాగా ఆ విషయం మరోసారి చర్చకు వచ్చింది.
వన్నియార్ కమ్యూనిటీని కించపరిచేలా చిత్రంలో క్యాలెండర్ సీన్ ఉందని ఆ సంఘం నేతలు గతేడాది నవంబర్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సీన్‌ను తొలగించాలని కోరారు. ఆ పిటిషన్‌ను సైదాపేట కోర్టు తాజాగా విచారించింది. హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, దర్శకుడు టీజే.జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించింది. కేసును దర్యాప్తు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది.
అయితే, ఈ సినిమా విడుదలైప్పుడే ఆ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వన్నియార్ సంఘం సూర్య, టీజే. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్‌కు లీగల్ నోటీసులు పంపించింది. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. కానీ, వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజాగా కోర్టు ఆదేశాలతో మళ్లీ ఈ అంశం తెర మీదకు వచ్చింది. చూడాలి మరి..‘జై భీమ్’ మూవీ యూనిట్ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో..