iSmart Shankar Review: మార్ ముంత చోడ్ చింత

-

సినిమా: ఇస్మార్ట్ శంకర్
జనర్: యాక్షన్, సైఫై, థ్రిల్లర్
నటీనటులు: రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: పూరీ జగన్నాథ్, చార్మి

నటుడు రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌లకు గత కొంత కాలంగా ఇండస్ట్రీలో హిట్లు లేవు. దీంతో వారు ఎప్పటి నుంచో చక్కని బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు, డైలాగ్‌లతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ అందరి అంచనాలను అందుకుందా.. లేదా..? చూద్దామా..?

కథ…

శంకర్ (రామ్) హైదరాబాద్ పాత బస్తీలో సెటిల్మెంట్స్ దందా చేస్తూ జాలీగా బతికేస్తుంటాడు. ఓ డీల్ విషయంలో చాందిని (నభా నటేష్) అతనికి పరిచయం అవుతుంది. దాంతో శంకర్ చాందిని ప్రేమలో పడతాడు.

అయితే అదే సమయంలో రాజకీయ నాయకుడు కాశిరెడ్డిని చంపిన కేసులో శంకర్ జైలుకు వెళ్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఆ సర్జరీని సైంటిస్ట్ పింకీ (నిధి అగర్వాల్) చేస్తుంది. అయితే అసలు శంకర్ మెదడులో మరో వ్యక్తి మెమొరీస్‌ను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది ? కాశిరెడ్డిని శంకరే నిజంగా చంపాడా ? శంకర్, సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్)కి ఉన్న సంబంధం ఏమిటి ? అనే వివరాలను మనం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు…

ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ఇస్మార్ట్ శంకర్ ఒకెత్తు.. అని చెప్పవచ్చు. ఈ మూవీలో రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సరికొత్త గెటప్‌లో ప్రేక్షకులకు కనిపించి అలరించాడు. తనదైన డైలాగ్ డెలివరీ, తెలంగాణ యాసతో రామ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు. శంకర్ పాత్రకు రామ్ పూర్తిగా న్యాయం చేశాడు. ఇక సినిమాలోని యాక్షన్ సీన్లలో రామ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంది. అలాగే హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో వీరిద్దరి గ్లామర్ డోస్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ పరంగానూ వీరి పాత్రలు చాలా బలంగా ఉంటాయి.

ఇక మరో కీలకపాత్రలో సత్యదేవ్ తెర మీద కనిపించి అలరించాడు. ఉండేది కొద్ది సేపే అయినా.. అతనికి ఈ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అలాగే షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థిలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ముగింపు…

వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ను చాలా పకడ్బందీగా తెరకెక్కించాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ మూవీని అతను తెరకెక్కించాడని మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా మనస్సు పెట్టి ఈ సినిమాను తీసినట్లు కొన్ని సన్నివేశాలను చూస్తే మనకు స్పష్టమవుతుంది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎంచుకోని భిన్నమైన కథాంశంతో పూరీ ఈ మూవీని తెరకెక్కించి ఒక గొప్ప ప్రయోగమే చేశాడు. పక్కా కమర్షియల్ విలువలతో సినిమాను తీసినా, అందులో కథ కూడా బలంగా ఉంటుంది. అయితే తనదైన శైలిని మాత్రం పూరీ ఈ సినిమాలోనూ కొనసాగించాడు.

పూరీ జగన్నాథ్ తీసిన గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ కాస్త భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. మాస్, యూత్ ప్రేక్షకులను ఈ మూవీ బాగా మెప్పిస్తుంది. తెలంగాణ యాసలో రామ్ చెప్పే డైలాగులు యువతను ఆకట్టుకుంటాయి. ఇక మణిశర్మ సినిమాకు చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అందించాడు. ప్రతి సీన్‌లో కావల్సినంత మేర ఎఫెక్ట్‌లను జోడిస్తూ మణిశర్మ సంగీతం అందించాడు. అలాగే పాటలు కూడా బాగుంటాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా బాగుంటుంది. పూర్తిగా రిచ్ ప్రొడక్షన్ విలువలతో సినిమాను తెరకెక్కించారు. ఎడిటింగ్ కూడా బాగుంటుంది.

ఇస్మార్ట్ శంకర్ మూవీకి రామ్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ. అలాగే సినిమాలో ఉండే మాస్, యాక్షన్, రొమాంటిక్ సీన్లు సినిమాను పీక్ స్థాయికి తీసుకెళ్తాయని చెప్పవచ్చు. అలాగే మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరొక ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమా రొటీన్ కమర్షియల్ ఫార్ములాను తలపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా యావరేజ్‌గా ఉంటుంది. అయినా ఓవరాల్‌గా ఇస్మార్ట్ శంకర్ మాత్రం ఫీల్ గుడ్ మూవీగా నిలిచే అవకాశం ఉంది. ఈ మూవీని చూసే వారు చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతారని చెప్పడంలో సందేహం లేదు.

ఇస్మార్ట్ శంకర్ మూవీ రేటింగ్: 3/5







Read more RELATED
Recommended to you

Latest news