సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు. దీంతో రాత్రి 9.30 గంటలకు ప్రదర్శించిన ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్ సుఖ్ నగర్ చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. దీంతో ఇవాళ అల్లు అర్జున్ ను చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించిన అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ ఘటన పై ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. “హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ పై తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.