సీనియర్ హీరోలలో కింగ్ నాగార్జున స్టైలే వేరని చెప్పొచ్చు. ఇప్పుడని కాదు ఆయన కెరియర్ మొదటి నుండి అందరిది ఒకదారైతే తనది మరోదారి అన్నట్టు సినిమాలు చేస్తూ వచ్చాడు. అందుకే ఇప్పటివరకు కథలు దొరకలేదు అన్న మాట ఆయన నోటి నుండి రాలేదు. అయితే ఇన్నేళ్ల కెరియర్ లో నాగార్జునని మెప్పించే కథలు ఈమధ్య రావడం లేదట. ఇది ఎవరో అంటున్న మాట కాదు స్వయంగా ఆయనే తన సన్నిహితులతో అన్నారట. రీసెంట్ గా వచ్చిన దేవదాస్ మల్టీస్టారర్ అన్న క్రేజ్ తప్ప రొటీన్ కథే. అందుకే సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టేసింది.
ప్రస్తుతం నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర, కోలీవుడ్ లో ధనుష్ సినిమా చేస్తున్నాడు. తెలుగులో మాత్రం తనకు నచ్చే కథలు దొరకడం లేదట. ఈమధ్య బంగార్రాజు అంటూ సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ప్రీక్వల్ తీద్దామనుకున్నా దానికి తగిన కథ సిద్ధం చేయడంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విఫలమయ్యాడట. ఇక చిలసౌ దర్శకుడు రాహుల్ రవింద్రన్ తో మన్మధుడు 2 అనుకోగా సీక్వల్ కు కథ రాయడంలో రాహుల్ మెప్పించలేదట. అందుకే ఆ ఇద్దరిని కాదని ఇప్పుడు వేరే ఎవరైనా తనకు సరిపోయే కథ ఉంటే రమ్మని పిలుపునిచ్చాడట. నిన్నటిదాకా వెంకటేష్ కూడా కథల విషయంలో ఇలాంటి ఇబ్బందులే పడ్డాడు. ఇప్పుడు వెంకటేష్ సినిమాలతో బిజీ అవగా నాగార్జున ఖాళీ అయ్యాడు. మరి నాగ్ మనసు మెప్పించే కథ ఎవరు తెస్తారో ఏ దర్శకుడికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.