టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొలిటికల్ జర్నీలో ఎంత బిజీబిజీగా ఉన్నా ఏ మాత్రం ఫ్రీ టైం దొరికినా సినిమాలు చూసేస్తుంటారు. ఆయన పలువురు తెలుగు హీరోలు నటించిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆ సినిమాలపై తన అభిప్రాయాన్ని కూడా చెపుతుంటారు. గతంలో బాహుబలి, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జై లవకుశ, రామ్‌చరణ్ రంగస్థలం, మహేష్‌బాబు శ్రీమంతుడు, భరత్ అనేనేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చూసి తన అభిప్రాయం చెప్పారు.
ఇక బుల్లితెర మీద రిలీజ్ అయ్యాక చాలా రోజులకు కంచె సినిమా చూసిన కేటీఆర్ ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఇప్పుడు దేశం అంతా ప్రభాస్ సాహో సినిమా ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ సినిమా చూసిన కేటీఆర్ సాహో టెక్నికల్‌గా అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ ఒకే రోజు ఎవరుతో పాటు సాహో సినిమాలు చూశారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఆ సినిమాలపై రివ్యూలాంటి తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు కేటీఆర్.
సాహో టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉందని.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిందన్న ఆయన ఈ సినిమా హీరో ప్రభాస్, దర్శకుడు సుజీత్‌లకు అభినందనలు తెలిపాడు. ఎవరు సినిమా గురించి మాట్లాడుతూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్బ్‌గా ఉందని… హీరో అడివి శేష్, రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారని అన్నారు. హిట్ అయిన ఎవరుతో పాటు నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సాహోను కూడా కేటీఆర్ ఆకాశానికి ఎత్తేయడం విశేషమే.
ఇక సాహో నెగిటివ్ టాక్‌తో కూడా వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.206 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.