స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు నిరాశ కలిగించిందని టాలీవుడ్ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాల పిటిషన్లపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయడం పార్లమెంటు విధి అని.. కోర్టులు చట్టాలు తయారు చేయలేవని వ్యాఖ్యానించింది.
స్వలింగ సంపర్కం.. నగరాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదని.. వివాహ చట్టంలో మార్పు అవసరమా కాదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. అయితే, స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంచు లక్ష్మి స్పందించారు. ‘ఈ తీర్పు నిరాశ కలిగించింది. దీని గురించి రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం’ అని ట్విట్ చేశారు.