టాలెంట్ ఎవరి సొత్తు కాదని చిత్ర పరిశ్రమ అందరినీ గౌరవించి అక్కున చేర్చుకుంటుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని తాను ఎంతో గౌరవిస్తానని, మనం ఎంతగా గౌరవిస్తే ఇండస్ట్రీ అంతలా అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మానని అన్నారు. అలాంటి ఇండస్ట్రీలోకి తన కుటుంబంలో నుంచి తన బిడ్డలొచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముందని పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ కథానాయిక. మార్చి 1న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. “నటుడిగా వరుణ్ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. డైరెక్టర్ శక్తి ప్రతాప్ ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే ఆయన సక్సెస్ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని అన్నారు.