కొన్నే మాట్లాడుతాయి..కొన్నే అందమయిన అర్థాలకు తూగి ఉంటాయి..రంగు మాట్లాడుతుంది అని అంటారు అక్షరం రంగులు అద్దుకుంటే..ఊహలకు రెక్కలు వచ్చాయి అంటారు.. రెక్కలు రావడం అంటే స్వేచ్ఛ అన్నది కవి వాక్కు. రంగులు అద్దుకోవడం అంటే.. ప్రజ్ఞకు సంకేతిక అని అర్థం. తూకం చెడొద్దు..అర్థం చెడొద్దు..మంచికి ఆనవాలు గొప్ప ప్రతిభకు ఆనవాలు..ఒకరి కృషి అయితే మేలు..వారిని చూసి పుష్ప ఫేం, క్రియెటివ్ డైరెక్టర్ సుకుమార్ బండ్రెడ్డి ఎంతగానో ఆనందిస్తారు.ఆ వివరం ఈ కథనంలో..
ఆర్ట్ స్పీక్స్ వెల్ అనే మాటకు అర్థం వెతికే పని ఎక్కువగా చేయాలి. ఆ పని ఎవ్వరు చేసినా అభినందించాలి. ఆ కోవలో ఆ తోవలో సుకుమార్ ఉంటారు. లెటర్స్ స్పీక్స్ వెల్ అనే మాటకు అర్థం కుదిరే పని ఒకటి చేయాలి. కవిత్వీకరించే ధోరణులను ప్రేమించి,
జీవితాన వాటికో ప్రాధాన్యం ఇవ్వాలి.ఈ రెండు పనులూ తరుచూ చేసే డైరెక్టర్ సుకుమార్ ఎప్పుడూ కొత్త వారికి అవకాశాలు ఇచ్చేందుకే ఎక్కువ ఆలోచిస్తుంటారు. సముచిత ప్రాధాన్యం దక్కితే ఆనందిస్తారు. అందుకే తన ఫెయిల్యూర్ ను ఎడిట్ చేసే వారంటే తనకు ఎంతో ఇష్టం అని తరుచూ చెబుతుంటారు. ఆ విధంగా తనను డిజిటల్ రంగుల్లో బంధించిన ఆర్టిస్టు గిరిధర్ అరసవల్లి పనితీరుకు అబ్బురపడ్డారు. ఆనందించారు. తనదైన భాషలో చెప్పాలంటే ఇతరులు అసూయ చెందేవిధంగా గిరిధర్ పనితనం ఉందని ప్రశంసించారు. దటీజ్ సుక్కూ ….
ఆర్టిస్టులను ప్రోత్సహించడంలో డైరెక్టర్ సుకుమార్ ఎప్పుడూ ముందుంటారు అనేందుకు ఉదాహరణలు ఎన్నో ! ఆర్టిస్టులను ప్రోత్సహించడమే కాదు వీలున్నంత వరకూ వారికి ఆర్థిక సాయం చేసి తనవంతుగా ఆయా కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉండేందుకు కూడా సిద్ధంగానే ఉంటారు సుకుమార్..ఒక్క ఆర్టిస్టులనే కాదు రైటర్లను కూడా ఆయన ఎంతో ప్రోత్సహిస్తారు. మారు మూల ప్రాంతాలకు చెందిన రచనలు చదవడం, కథలు గురించి తెలుసుకోవడం, నవలలు చదవడం వీలుంటే ఆయా రచయితలతో భేటీ అవ్వడం, వారితో గంటల తరబడి చర్చించడం వంటివి కూడా చేస్తుంటారు సుక్కూ.. ఇదంతా ఆయన దైనందిన జీవితంలో ఓ భాగం.
తాజాగా డైరెక్టర్ సుక్కూను ఓ డిజిటల్ ఆర్టిస్ట్ విపరీతంగా ఆకట్టుకున్నారు. విజయవాడకు చెందిన గిరిధర్ అరసవల్లి ఎప్పటి నుంచో డిజిటల్ ఆర్టిస్టుగా సుపరిచితులు. ముఖ్యంగా ఇదే రంగాన్ని నమ్ముకున్న వారికి ఓ విధంగా స్ఫూర్తి కూడా ! బెజవాడ అంటేనే ప్రచురణ రంగానికి ఎంతో ప్రసిద్ధి. ఆయన నేతృత్వంలోనే శ్రీశ్రీ మహా ప్రస్థానం అతి పెద్ద సైజ్ లో మహాకవి స్వీయ దస్తూరీతో రూపుదిద్దుకున్న వైనం కూడా మరువలేం. ఆ బుక్ పవన్ కు, త్రివిక్రమ్ కు ఎంతగానో నచ్చింది. ముఖ్యంగా శ్రీశ్రీ కవితా సారాన్ని అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు ఆయన. తాజాగా డైరెక్టర్ సుకుమార్ ను గిరిధర్ స్నేహితులు పార్థసారథి వల్లభజోశ్యుల టెక్సాస్ నగర దారుల్లో కలిశారు.ఈ సందర్భంగా ఆయన వేసిన డిజిటల్ ఆర్ట్ (పోట్రేయిట్ ) ను ఆయనకు చూపించారు. తన చిత్రం రూపకల్పనకు ఎంతగానో మెచ్చుకున్నారు.
– రత్నకిశోర్ శంభుమహంతి