ప్రముఖ నటుడు సాయాజీ షిండే అస్వస్థతకు గురయ్యారు. గురువారం రోజున ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు స్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో యాంజియోప్లాస్టీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారని వెల్లడించారు.
సాయాజీ షిండే గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. రొటీన్ చెకప్‌లో భాగంగా తమను సంప్రదించినప్పుడు ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించామని, యాంజియోగ్రఫీ చేయించమని సూచించామని చెప్పారు. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్ గుర్తించామన్న వైద్యులు, తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని పేర్కొన్నారు.
మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. ‘ఠాగూర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘గుడుంబా శంకర్’, ‘సూపర్’, ‘అతడు’, ‘రాఖీ’, ‘పోకిరి’, ‘దుబాయ్ శీను’, ‘నేనింతే’, ‘కింగ్’, ‘అదుర్స్’ వంటి చిత్రాల్లో నటించి అలరించారు.