బిగ్బాస్ ఫైనల్స్ రోజున విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్దీప్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. పరస్పరంగా గొడవకు దిగడమే కాకుండా అక్కడున్న పలువురి వాహనాలు ధ్వంసం చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగులగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే..దీనిపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ స్పందించారు.
కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్ బాస్ సీజన్ – 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కక్ష సాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదులో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో ప్రశాంత్ పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నా…. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు.
అరెస్టు చేస్తారనే భయంతో ప్రశాంత్ తో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సామాన్య రైతుబిడ్డగా వెళ్లి బిగ్ బాస్ టైటిల్ ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. తమ కొడుకుపై కక్ష సాధిస్తున్నారని విలేకరుల సమావేశంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంటతడి పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్ ఎంతో కష్టపడి చివరకు తాను అనుకున్న దాన్ని సాధించాడని, కానీ ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని వారు కోరారు.