ఆర్‌జీవీ క్లైమాక్స్ మూవీ.. రివ్యూ, రేటింగ్‌.. ఫ్యాన్స్‌కు మాత్ర‌మే..!

-

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే.. సంచ‌ల‌నాల‌కు పెట్టింది పేరు. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌తో, త‌న‌దైన శైలిలో.. ప్రేక్ష‌కుల‌కు సూటిగా, సుత్తి లేకుండా.. అద్భుత‌మైన సస్పెన్స్‌తో, కొత్త త‌ర‌హాలో సినిమాల‌ను నిర్మించి.. అందిస్తార‌నే టాక్ ఉండేది. అందుకే ఆయ‌న‌కు ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఉండేవారు. కానీ అది గ‌తం.. వ‌ర్మ మ‌ళ్లీ అలాంటి సినిమాల‌ను తీయ‌డం లేదు.. ఆయ‌న‌లో ఉండే ఆ పాత శైలి ఏమైందో తెలియ‌దు. కానీ.. తాజాగా ఆయ‌న తీస్తున్న చిత్రాల‌న్నీ పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని త‌ల‌పిస్తున్నాయి. కొత్త‌గా ఎలాంటి వెరైటీ లేకుండానే.. సో సో గా సినిమాల‌ను తీసి.. మ‌మ అనిపించేస్తున్నారు. స‌రిగ్గా అలా తీసిందే.. తాజాగా నెట్‌లో విడుద‌లైన‌.. క్లైమాక్స్ మూవీ..

ram gopal varma climax movie review rating

క్లైమాక్స్ మూవీ.. నిడివి కేవ‌లం 52 నిమిషాలు మాత్ర‌మే.. సాధార‌ణంగా హాలీవుడ్ లేదా బాలీవుడ్.. ఎక్క‌డైనా స‌రే.. ఎంత చిన్న మూవీ అయినా.. క‌నీసం గంట‌న్న‌ర నిడివి ఉంటుంది. అయితే క్లైమాక్స్ మూవీ అంత‌కు త‌క్కువ‌గానే నిడివి క‌లిగి ఉంది. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే.. అస‌లు సినిమాలో ప్రేక్ష‌కుడికి వ‌ర్మం ఏం చెప్పార‌నేది అర్థం కాదు. సినిమా చూశాక స‌గ‌టు ప్రేక్ష‌కుడికి కూడా అదే ఫీలింగ్ క‌లుగుతుంది. క‌థ అవ‌స‌రం లేదు, మియా మ‌ల్కోవా కోస‌మే చూస్తాం.. అని సినిమా చూసే వారు అస‌లు ఈ మూవీ జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే వారు ఆశించే స్థాయికి చెందిన స‌న్నివేశాలు ఏమీ అందులో ఉండ‌వు. దానిక‌న్నా.. మియా మ‌ల్కోవా శృంగార తార‌గా చేసిన వీడియోలే బెట‌ర్‌. వాటిని మొబైల్ ఫోన్ల‌లో చూసి ఆనందించ‌వ‌చ్చు. అంత‌కు మించి క్లైమాక్స్ మూవీలో ఎక్స్‌పెక్ట్ చేద్దామనుకుంటే.. ప్రేక్ష‌కుల‌కు నిరాశే ఎదుర‌వుతుంది.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. రాజ‌స్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతానికి ద‌గ్గ‌ర్లో ఉండే ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామానికి ఓ జంట (మియా మ‌ల్కోవా, ఆమె ల‌వ‌ర్‌) ఎంజాయ్ చేసేందుకు వ‌స్తారు. వారికి పెళ్లి కాదు. స‌రే.. ఎంజాయ్ చేసేందుకు పెళ్లి కావాలా.. ఏంటీ.. అనుకుందాం.. కానీ వారు ఎంచుకున్న స్పాట్.. ఎడారి ప్రాంతం. భ‌గ భ‌గ మండే ఎండలు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో ల‌వ‌ర్స్ లేదా క‌పుల్స్ ఎవ‌రైనా అస‌లు ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటారా ? లేదు క‌దా.. కానీ వ‌ర్మ పూర్తిగా డిఫ‌రెంట్ క‌దా.. అందుక‌నే ఆయ‌న‌ అలా స‌్టోరీని రాసుకున్నాడ‌నుకుందాం. ఆ విష‌యాన్నీ ప‌క్క‌న పెట్టేద్దాం.. ఇక క‌థ‌లో కాస్త ముందుకు వెళితే ఆ జంట ఓ గ్రామం స‌రిహ‌ద్దుకు జీపులో వ‌స్తారు. అక్క‌డ ఓ గోడ‌పై డు నాట్ ఎంట‌ర్ అని రాసి ఉంటుంది. దాన్ని చూసి మియా మ‌ల్కోవా వెన‌క్కి వెళ్దామ‌నుంటుంది. ఆమె ల‌వ‌ర్ భ‌య ప‌డ‌కు అని చెప్పి.. లోప‌లికి వెళ్తారు. అక్క‌డ వారు ఎంజాయ్ చేస్తారు. ఆ క్ర‌మంలో వారికి వింతైన అనుభ‌వాలు ఎదుర‌వుతాయి. త‌రువాత వారు ఆ గ్రామంలోనే ఉండిపోతారు. అయితే ఆ గ్రామానికి వెళ్లిన ఆ జంట‌కు ఎదురైన ఆ అనుభ‌వాలు ఏమిటి ? వారు ఎందుకు అక్క‌డ ఉండిపోతారు ? అనే విష‌యాల‌ను మాత్ర‌మే నిజానికి మూవీలో చూపించారు. కానీ మూవీలో ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు ఇంకా వ‌ర్మ స‌మాధానం చెప్ప‌లేదు. ఫ‌లితంగా క్లైమాక్స్ కాస్తా.. అసంపూర్తి క్లైమాక్స్‌గా మారిపోయింది. ఇక ఇంతోటి దానికి వ‌ర్మ అంత హైప్ ఎందుకు క్రియేట్ చేశారు ? అనేది ప్రేక్ష‌కుల‌కు ఇప్ప‌టికీ అంతుబ‌ట్ట‌ని విష‌యం.

క్లైమాక్స్‌ను వ‌ర్మ నిజానికి అవ‌స‌రం అనుకుంటే థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేసుకోవ‌చ్చు. అందులో మియా ఉండే ఒక‌టి రెండు సీన్ల‌ను క‌ట్ చేస్తే థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు అవ‌కాశం ఉండేది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీ థియేట‌ర్ స్థాయి సినిమా కాదు. క‌నుక‌నే వ‌ర్మ వెబ్‌లో రిలీజ్ చేశారు. పే ప‌ర్ వ్యూ లెక్క‌న ఒక్క‌సారి మూవీ చూస్తే రూ.100 చెల్లించాల‌ని నిబంధ‌న పెట్టారు. అయితే మూవీ తీసేందుకు పెట్టిన మొత్తం వ‌ర్మకు వ‌స్తుందో, లేదో తెలియ‌దు కానీ.. ఈ మూవీని చూసిన ప్రేక్ష‌కుల‌కు మాత్రం వ‌ర్మ‌పై మ‌రింత చిర్రెత్తుకు రావ‌డం ఖాయం. కానీ సినిమాలో ఉన్న ప‌లు సస్పెన్స్ స‌న్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ‌ళ్లీ ఆ పాత వ‌ర్మ‌ను మ‌న‌కు గుర్తు చేస్తాయి. దెయ్యం సినిమాలో ఎలాగైతే ప్రేక్ష‌కుల‌కు భ‌యం క‌లిగించే సీన్లు పెట్టారో, కొన్ని సీన్లు ఇందులో అలాగే ఉంటాయి. కానీ ఓవ‌రాల్‌గా చూస్తే.. క్లైమాక్స్ మూవీ బిలో యావ‌రేజ్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. వ‌ర్మ ఫ్యాన్స్ అయితే క‌చ్చితంగా మూవీని చూడ‌వ‌చ్చు.

క్లైమాక్స్ మూవీ రివ్యూ, రేటింగ్‌: 2/5

Read more RELATED
Recommended to you

Latest news