గడ్డి వాము దగ్గరి కుక్క తాను తినదు.. ఇంకొకరిని తిననివ్వదు.. అన్న చందంగా తయారైంది.. శివసేన పరిస్థితి. దేశంలో ఓ వైపు వలస కూలీలు తినడానికి తిండి లేక, చేసేందుకు పనిలేక, సొంత ఊళ్లకు వెళ్లేందుకు చేతిలో డబ్బు లేక తీవ్రమైన కష్టాలు పడుతుంటే.. వారిని ఆదుకోవాల్సింది పోయి.. వారికి సహాయం చేసే మానవత్వం ఉన్న మనుషులపై.. నీచ రాజకీయాలు చేస్తోంది. వలస కూలీలకు ఏ సెలబ్రిటీ చేయని విధంగా సహాయం చేస్తున్న సోనూసూద్‌పై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై తీవ్రస్థాయంలో మండిపడ్డారు. సోనూసూద్.. ప్రధాని మోదీని కలిసేందుకే పెద్ద ఎత్తున వలస కూలీలకు సహాయం చేస్తున్నాడని, ఏమో.. మోదీని అతను త్వరలో కలుస్తాడేమో.. అన్నారు. ముంబైకి సోనూసూద్ సెలబ్రిటీ మేనేజర్ అవుతాడేమోనని అన్నారు. కోవిడ్ 19 సమయంలో ఓ మహాత్ముడు (సోనూసూద్) సడెన్‌గా ఎక్కడి నుంచో పుట్టుకొచ్చాడని, ఎన్నో లక్షల మంది వలస కార్మికులను అతను వారి సొంత గ్రామాలకు చేర్చాడని, అందుకు మహారాష్ట్ర గవర్నర్ సోనూసూద్‌ను.. మహాత్మా సూద్ అని అభివర్ణించారని.. అన్నారు.
వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న చందంగా సోనూ సూద్ వ్యవహరించాడని రౌత్ అన్నారు. కేవలం సోనూసూద్ మాత్రమే వలస కార్మికులను ఆదుకుంటున్నాడని ప్రచారం అయిందని అన్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ సమయంలో సోనూసూద్‌కు బస్సులు ఎక్కడినుంచి లభ్యమయ్యాయో తెలపాలన్నారు. ఇక రాష్ట్రాలన్నీ వలస కార్మికులను అనుమతించడం లేదని, అలాంటప్పుడు సోనూ సూద్ పంపిన కార్మికులందరూ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఈ మేరకు రౌత్ శివసేన పత్రిక సామ్నాలో ఓ ఎడిటోరియల్ రాశారు.
అయితే నిజానికి సోనూసూద్ ఎంతో పెద్ద మనస్సుతో వలస కార్మికులకు సహాయం చేశాడని మనందరికీ తెలుసు. కొందరిని బస్సుల్లో పంపిస్తే, కొందరి కోసం విమానాలను బుక్ చేశాడు. ఏది ఏమైనా.. అతను చేసింది సహాయం.. చట్ట వ్యతిరేకమైన పనికాదు. ఆ మాట కొస్తే కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పేదలకు, వలస కార్మికులకు సహాయం చేశాయి. వారికి తిండి పెట్టాయి. వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సహాయం చేశారు. ఇక సోనూసూద్ చేసింది కూడా ఇలాంటిదే. అలాంటప్పుడు బోడి గుండుకు (పదం వాడినందుకు క్షమించాలి), కోడిగుడ్డుకు ముడిపెట్టినట్లు.. శివసేన నేత రౌత్ అలా వ్యాఖ్యానించడం సరికాదు. వ్యక్తులు చేసినా, సంస్థలు చేసినా సహాయం సహాయమే. అందుకు వారిని అభినందించాలి. కానీ కించ పరిచే మాటలు మాట్లాడరాదు. నిజంగా రాజకీయ నాయకులకు గనక సోయే ఉంటే.. నిజానికి దేశంలో ఇన్ని కరోనా కేసులు నమోదు అయ్యేవి కావు. చేసేదంతా వాళ్లే.. కానీ వారి పనులకు ఫలితాన్ని అనుభవించేది మాత్రం జనాలు.. నేతలు ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకుంటే మంచిది.