అరుదైన రికార్డు.. ఒకే సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో తీసిన నిర్మాత.. ఎవరంటే?

-

మూవీ మొఘల్, డాక్టర్ డి.రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించిన రామానాయుడు.. తన సంస్థ ద్వారా ఎంతో మంది నూతన నటీనటులు, దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు్ల్లో ఆయన పేరు నిలవగా, దేశంలోని 13 భాషల్లో 150కిపైగా చిత్రాలను ఆయన నిర్మించారు. కాగా,ఒక చిత్రం విషయంలో రామానాయుడు అరుదైన రికార్డు సాధించారు. ఆ చిత్రాన్ని రామానాయుడు తొలుత తెలుగులో తీశారు. ఆ తర్వాత తమిళ్, ఆ తర్వాత హిందీలో తీసి అన్ని భాషల్లో ఘన విజయం సాధించారు. ఆ సినిమా ఏది., దర్శకుడు ఎవరు? అనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి రామానాయుడు అందించిన సేవలకు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన్ను సత్కరించింది. రామానాయుడు నిర్మాతగానే కాగా, పలు చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి తనలోని నటుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా దాదాపుగా విజయం సాధించడం విశేషం. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.ప్రకాశ్ రావు దర్శకత్వంలో రామానాయుడు నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రం ‘ప్రేమ్ నగర్’.

అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో రికార్డు వసూళ్లు చేసింది. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించగా, పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఇదే చిత్రాన్ని తమిళ్ భాషలో సేమ్ డైరెక్టర్ తో మళ్లీ తీశారు ప్రొడ్యూసర్ రామానాయుడు. కె.ఎస్.ప్రకాశ్ రావు దర్శకత్వంలో శివాజీ గణేశన్ హీరోగా ‘వసంత మలిగై’ అనే టైటిల్ తో తీశారు. ఇందులోనూ హీరోయిన్ గా వాణి శ్రీ నటించగా, ఈ పిక్చర్ కూడా సూపర్ హిట్ అయింది.

ఇక ఆ తర్వాత ఇదే చిత్రాన్ని రామానాయుడు హిందీలోనూ ‘ప్రేమ్ నగర్’ అనే టైటిల్ తో తీశారు. రాజేశ్ ఖన్నా, హేమా మాలిని హీరో, హీరోయిన్లుగా నటించగా, సేమ్ దర్శకుడు కె.ఎస్.ప్రకాశ్ రావు దర్శకత్వం వహించారు.

అలా ఒకే చిత్రాన్ని ఒకే దర్శకుడితో మూడు భాషల్లో తీయించి అరుదైన విజయం అందుకున్నారు మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. రామానాయుడు మరణానంతరం ఆయన స్థాపించిన బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్స్ ను ఆయన తనయుడు సురేశ్ బాబు నిర్వహిస్తున్నారు. రామానాయుడు రెండో తనయుడు వెంకటేశ్, మనవడు రానా హీరోలుగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version