నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఘటనలో నిందితుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంతో తాజాగా అతడి అరెస్టుపై రష్మిక స్పందించింది. ఈ మేరకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పింది. మార్ఫింగ్ వీడియోలు, ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె యువతకు సూచించింది. ముఖ్యంగా అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.
‘‘దిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు. ప్రేమతో నన్ను ఆదరించి.. అన్నివిధాలుగా అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యువతకు చెప్పేదొక్కటే.. అనుమతి తీసుకోకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్కడైనా ఉపయోగిస్తే అది నేరం’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేసింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి అసభ్యకర వీడియోను సృష్టించిన విషయం తెలిసిందే. అది నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ఏపీలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్ (24)ను తాజాగా అరెస్టు చేశారు.