సూపర్‌స్టార్ కృష్ణ, ‘సరిలేరునీకెవ్వరు’లో ప్రత్యేక అతిథిపాత్ర పోషించినట్లు దర్శకుడు, కథానాయకుడు ప్రెస్‌మీట్లో ఊదరగొట్టారు. తీరా చూస్తే, ఆయన మొబైల్‌ఫోన్లో కనిపిస్తారు.
అతిథి
సినిమా ప్రమోషన్‌లలో భాగంగా, ‘సరిలేరునీకెవ్వరు’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో మహేశ్‌బాబు తాము నిర్వహించిన ప్రెస్‌మీట్లలో, సర్‌ప్రయిజ్ అంటూ, ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ అతిథి పాత్ర పోషించినట్లు సంచలన ప్రకటన చేసారు. దాంతో ఉన్నట్టుండి సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
అసలే, సినిమా ఏంటీ, ఇలా ఉంది? అనుకుంటూ ప్రేక్షకులు నీరసపడిపోతూంటే, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, ఈ ‘సర్‌ప్రయిజ్’. ఇంతకీ ఆ ఆశ్చర్యకరమైన దృశ్యం ఏమిటంటే, విలన్ అజయ్‌ను హీరో మహేశ్, చావచితగ్గొట్టాక, అతనెళ్లి వాళ్ల బాస్‌కు హీరో గారి ధీరత్వం గురించి చెబుతూ, మొబైల్‌ఫోన్‌లో ‘అల్లూరి సీతారామరాజు’ సీన్‌ను చూపిస్తాడు. ఆయన్ను చూస్తే ఈయన్ని చూసినట్టే ఉంది అని సోదాహరణంగా వివరిస్తాడు. ఈ సీన్లో, మొబైల్‌ఫోన్లో దర్శనమిచ్చిన అల్లూరి సీతారామరాజే, ఈ సినిమాలో కృష్ణ గారి గెస్ట్ అప్పియరెన్స్…. అదన్న మాట సంగతి.
దర్శకుడు, ప్రేక్షకులను పిచ్చిపుల్లయ్యలనుకుని పెట్టిన సీన్… చెప్పిన పద్దతి ఇది. ఏమాత్రం సింక్ కాలేని చీప్ కామెడీని మహేశ్‌బాబుకి పెట్టి, స్థాయిని దిగజార్చారని అభిమానులు ఓ పక్క గొణుక్కుంటూ సినిమా చూస్తుంటే, మధ్యలో వచ్చిన ఈ సీన్ చూసి అవాక్కయ్యారు. గెస్ట్ అప్పియరెన్స్ అంటే ఇదా… అంటూ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
ఈ లెక్కన చూస్తే, మన కథానాయికానాయకులు కొన్ని వందల సినిమాల్లో ఇలాగే ‘అతిథి పాత్ర’ పోషించారు మరి. వాళ్లందరూ ఆ యా చిత్రాల్లో నటించినట్లేనా.. ? అనే సందేహాన్ని తీర్చాల్సింది హీరో-దర్శకులే.