మీటూ ఉద్యమానికి నాంది పలికిన బాలీవుడ్ హీరోయిన తనుశ్రీ దత్తా తాజాగా మరో సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ మాఫియా తనను వేధిస్తోందని ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్లో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. కొంతమంది తనను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని అన్నారు. తనను కాపాడాలని వేడుకున్నారు. తన పనిమనిషితో కుమ్మక్కై తనకు స్టెరాయిడ్స్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.
“కొంతమంది వ్యక్తులు నన్ను టార్గెట్ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. దయచేసి ఎవరైనా, ఏదో ఒకటి చేసి నాకు సాయం చేయండి..!! గతంలో ఏడాది పాటు నా సినిమాలు ఆడకుండా చేశారు. మా పనిమనిషితో కుమ్మక్కై తాగే నీటిలో స్టెరాయిడ్స్, కొన్నిరకాల మందులు కలిపి నాకు అందించేలా చేశారు. దానివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. ఇవన్నీ తట్టుకోలేక మే నెలలో ఉజ్జయిని పారిపోయా. అక్కడ నా బైక్ బ్రేకులు తీసేసి రెండుసార్లు ప్రమాదాలకు గురి చేశారు. ధైర్యంతో చావు నుంచి బయటపడి మళ్లీ సాధారణ జీవితం కోసం 40 రోజుల తర్వాత తిరిగి ముంబయికి వచ్చా. ఇవన్నీ చూసి భయంతో ఆత్మహత్య చేసుకోను. ఎక్కడికి పారిపోను. నా కెరీర్‌ని తిరిగి నిర్మించుకునేందుకు ఇక్కడే ఉండి కష్టపడతా. బాలీవుడ్ మాఫియా ఇదంతా చేస్తోంది. మీటూ వేదికగా నేను ఎవరిపైనైతే ఆరోపణలు చేశానో, అప్పట్లో నేను ఏ ఎన్‌జీవోని అయితే నిందించానో వారే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నన్ను టార్గెట్ చేయడం వల్ల వేరేవాళ్లకి ఏం లాభం?” అని తనుశ్రీ దత్తా ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
బాలీవుడ్లో ఆషిక్ బనాయా ఆప్నే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ దత్తా.. నటిగా రాణిస్తున్న సమయంలో నటుడు నానాపటేకర్ తనని వేధించాడని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. మీటూకు తెరలేచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మరోసారి నానాపటేకర్ విరుచుకుపడ్డారు.