Tollywood: ద‌స‌రాకు కుర్రా హీరోల సందడి! ఆ త్రిముఖ పోరు త‌ప్ప‌దా ?

Tollywood: తెలుగు చిత్ర సీమ‌కు సంక్రాంతి, సమ్మర్ సీజన్‌ల తరహాలో దసరా సీజన్ కూడా చాలా ముఖ్యమైనదే. ఈ సారి ద‌స‌రా కళ బాక్సాఫీసు వ‌ద్ద క‌నిపించ‌నున్న‌ది. అయితే.. అగ్రహీరోలు ఎవరూ బరిలో లేరు. కానీ, కుర్ర హీరోలు మాత్రం వసూళ్ల వేటలో సై అంటూ రంగంలోకి దూకుతున్నారు. వ‌రుస‌గా నాలుగు సినిమాలు, ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. మ‌హా స‌ముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌, పెళ్లి సంద‌D, వ‌రుడు కావలెను. దీంతో సినిమాల‌తో యువహీరోల మధ్య పండగ పోటీ ఉండబోతుంది.

ఆర్‌.ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన‌ సినిమా మ‌హా స‌ముద్రం. ఈ చిత్రంలో శ‌ర్వా, సిద్దార్థ్ క‌లిసి న‌టించారు.వాళ్లిద్దరూ స్నేహితులుగా నటిస్తున్న చిత్రమిది. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లు. ఇప్ప‌టికే.. ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ రెండూ ఆకట్టుకున్నాయి. ప్రేమ‌కీ, స్నేహానికీ, ప‌గ‌కీ,పంతానికీ జ‌రిగిన పోరాటం – ప్రచార చిత్రాల్లో క‌నిపిస్తోంది.
రావు రమేశ్‌, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో విడుదల కానుంది. మ‌హా స‌ముద్రంకి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగాఉన్నాయి.

హీరోగా మూడు సినిమాలు చేసినా స‌రైన స‌క్సెస్ ద‌క్క‌ని హీరో అఖిల్ అక్కినేని. ఈ త‌రుణంలో వ‌స్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్. ఈ చిత్రంపైనా అనేక ఆశ‌లు పెట్టుకున్నాడు అక్కినేని వార‌సుడు. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ స‌ర‌స‌న‌ పూజాహెగ్డే నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం కూడా అక్టోబరు 15న దసరా పండగ కానుకగా విడుదలవుతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు. గోపిసుందర్‌ అందించిన బాణీలు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ రావోచ్చున‌ని టాక్.

సీనియర్‌ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ హీరోగా గౌరి రోనంకి దర్శకత్వం చేస్తున్న చిత్రం
పెళ్లిసందD’. ఈ చిత్రం రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కింది. రోషన్ స‌ర‌స‌న‌ శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం కూడా దసరా కానుకగా అక్టోబరు 15న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందించగా.. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

తాజాగా యువ హీరో నాగ‌శౌర్య కూడా ద‌స‌రా బ‌రిలో నిలుస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా సినిమా వరుడు కావలెను చిత్రం అక్టోబ‌ర్ 15న చిత్రాన్నివిడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. నాగశౌర్య-రీతూ వర్మ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ అన్నీ ప్రామిసింగ్ గా వుండడంతో కొంత బజ్ వచ్చింది. డీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇలా మొత్తానికి ఈ దసరా సీజన్‌లో బాక్సాఫీస్ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ చిత్రం హిట్ అయితుందో.. ఏ చిత్రం ఫ్లాప్ అవుతుందో వేచి చూడాలి.