డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలతో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల విచారణలో ఆయన కీలక విషయాలు తెలిపినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసేందుకు మధ్యవర్తులు ఉండేవారని.. అడిగితే సినిమా సెట్స్‌కూ తీసుకువచ్చి ఇచ్చేవారని చెప్పినట్లు వార్తాకథనాలు వచ్చాయి. విచారణలో భాగంగా ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇక షైన్ టామ్ చాకో బ్యాంక్ లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. అతని అకౌంట్ నుంచి వేర్వేరు వ్యక్తులకు నగదు బదిలీ అయినట్లు గుర్తించిన అధికారులు వాటిపై నటుడని ప్రశ్నించగా.. అప్పుగా ఇచ్చినట్లు చెప్పినట్లు తెలిసింది.
కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇటీవల సోదాలు చేయగా.. వారు హోటల్ కు వచ్చే ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనా పోలీసులు ఆయణ్ను ప్రశ్నించగా.. తనకు తెలిసిన అమ్మాయిని కలవడం కోసమే అక్కడికి వెళ్లినట్లు చెప్పారట. మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ చేసిన ఆరోపణలపైనా ఆయన స్పందిస్తూ… ఆమెతో తాను అభ్యంతరకరంగా ప్రవర్తించలేదని చెప్పినట్లు సమాచారం.