టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఫైర్ అయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను రాఘవేంద్రరావు తప్పుబట్టారు. ప్రపంచవేదికపై మన సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలని హితవు పలికారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు.
‘‘తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటిసారి ప్రపంచవేదికలపై వస్తోన్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి. అంతేకానీ, రూ.80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటి పేరుపొందిన దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా?’’ అంటూ దర్శకేంద్రుడు తమ్మారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ్మారెడ్డి భరద్వాజ.. రూ.600 కోట్లు పెట్టి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ ఖర్చుతో 8 సినిమాలు తీయొచ్చని అన్నారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు సినీ సర్కిల్లో దుమారం రేపాయి.