నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు కావొస్తున్నా ఇంకా థియేటర్లలో బాలయ్య మేనియా కనిపిస్తోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. మరోసారి బాలకృష్ణ సంక్రాంతి హీరోగా అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో బాలయ్య పంచకట్టులోనూ సూపర్ స్టైలిష్ గా కనిపించారంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు.
అయితే, ఓ సన్నివేశంలో బాలకృష్ణ తన కాలితో కారును తంతే, వెనక్కి వెళ్తుంది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్ మొదలయ్యాయి.‘పలనాటి బ్రహ్మనాయుడు’లో తొడగొడితే రైలు వెనక్కి వెళ్లిన సన్నివేశంతో పోల్చి మీమ్స్ కూడా చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపిచంద్ మలినేని స్పష్టతనిచ్చారు. ఈ సీన్‌పై ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
‘‘వీరసింహారెడ్డి పాత్ర గొడ్డలితో కారు ముందు నిలబడినప్పుడు అందులో ఉన్న వాళ్లు రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్లాలనుకుంటారు. అయితే, కారు వెనుక చక్రం మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. బాలకృష్ణగారు డైలాగ్ చెప్పిన తర్వాత కాలితో కారును తంతారు. దీంతో మట్టిలో దిగబడిపోయిన కారు టైరు పైకి లేస్తుంది. అప్పటికే కారు రివర్స్ గేర్‌లో ఉంది కదా! అప్పుడది వెనక్కి వెళ్లకుండా ముందుకు వస్తుందా? మీరే చెప్పండి. దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మీమ్స్ చేసేవాళ్లు రకరకాలుగా చేస్తారు. బాలకృష్ణగారితో చర్చించే ఈ సీన్ తీశా’’ అని గోపీచంద్ మలినేని అన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో గోపీచంద్ చిరంజీవి, రవితేజల గురించి కూడా మాట్లాడారు. “చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్ తెప్పించి గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్ బాగుంటుందని అన్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు నాకు ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదు. వీర సింహారెడ్డికే తొలి సారి ఇచ్చారు.” అని గోపి చంద్ చెప్పుకొచ్చారు.