తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్ స్వామి నాథన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చిత్రం ‘మహారాజ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇదీ మహారాజ స్టోరీ : మహారాజా (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఒక ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అతనికంటూ మిగిలిన ఒకే తోడు కూతురు జ్యోతి. తను ఆ బిడ్డతోనే కలిసి సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. ఒకరోజు ముగ్గురు అగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని.. ఈ క్రమంలోనే తమ బిడ్డ ప్రాణాల్ని కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని ఎలాగైనా సరే ఆ లక్ష్మిని వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. మరి మహారాజా చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? అతని ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు తొలుత ఎందుకు నిరాకరించారు? అసలు మహారాజాపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులెవరు? వాళ్లకు, అతనికి ఉన్న విరోధం ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.