డిసెంబర్ 05న అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి అనగా డిసెంబర్ 04న ప్రీమియర్స్ షోలు ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ లో 9.30కి ప్రీమియర్ షో ప్రదర్శించగా.. ఈ షోకి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, అల్లు అర్జున్ ఫ్యామిలీ వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మరణించింది.
దీంతో థియేటర్ యాజమాన్యం పై, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. తాజాగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ యాజమాన్యం ఓ లేఖను బయటపెట్టింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని.. ముందుగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశామని ఓ లేఖను షేర్ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9.30 గంటలకు అల్లు అర్జున్, హీరోయిన్, వీఐపీలు వస్తున్నారు. భారీ ప్రజలు తరలివస్తారు. కాబట్టి పోలీసులు బందోబస్తు కల్పించండని ఏసీపీకి లేఖను రాశారు.