మనం తీసుకున్న గొయ్యిలో మనమే పడటం అనే సామెత ఉంది కదా. ఉక్రెయిన్ ప్రభుత్వం చేతుల్లో ఆ దేశ సైనికులే 40 మంది చనిపోవడం ఈ సామెతకు కరెక్ట్‌గా నిరూపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి తెలిపారు. ఆ ఘటనలో 130 మంది గాయపడ్డారని కూడా చెప్పారు.
ఉక్రెయిన్‌పై గత కొన్ని నెలలుగా రష్యా.. దండయాత్ర చేస్తూనే ఉంది. ఈ క్రమంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. మరియుపోల్ ప్రాంతంలో జరిగిన యుద్దం తర్వాత అరెస్టైన ఉక్రెయిన్ సైనికుల్లో 40 మంది మరణించారని, 130 మంది గాయపడ్డారని తెలియజేశారు. అయితే వీరంతా ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని చెప్పారు.
ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై షెల్లింగ్ జరిపినట్లు వెల్లడించారు డొనెట్స్క్లోని వేర్పాటువాదుల ప్రతినిధి డానిల్ బెసొనోవ్. దీనిపై ఉక్రెయిన్ అధికారుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు.
యుద్ధసమయంలో.. అజోవ్ ఓడరేవు, స్టీల్ మిల్కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్ సైనికులు దాదాపు 3 నెలల అనంతరం రష్యాకు లొంగిపోయారు. అప్పటినుంచి వీరిని రష్యా మద్దతున్న డొనెట్స్క్ వంటి ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఇప్పుడు ఉక్రెయిన్ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.