సాయిబాబా ఊది వెనుక రహస్యాలు మీకు తెలుసా ?

-

బాబా.. సాయిబాబాను కోట్లాదిమంది భక్తులు కొలుస్తారు. ఆయన చెప్పిన మార్గంలో కోట్లాదిమంది భక్తులు నడుస్తారు. అయితే ఆయన ప్రతి మాటలో,చేతలో అనేక అంతరార్థాలు ఉన్నాయి. అలాంటివాటిలో బాబా ఊది గురించి తెలుసుకుందాం…


బాబా తన జీవితకాలంలో భక్తులతో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎంచుకున్న ప్రత్యక్ష మార్గాలు రెండు. ఒకటి- వారి మోహాన్ని త్రుంచివేసేందుకు దక్షిణను కోరడం. రెండు- వారి కష్టాలను తీర్చేందుకు ఊదీని అందించడం. డబ్బు మనిషికి ఉన్న మోహానికి చిహ్నమైతే, విభూతి ఈ ప్రపంచం నశ్వరం అన్న సందేశానికి ప్రతీక. ఈ రెండింటి ద్వారా బాబా తన భక్తులకు అపూర్వమైన అనుభవాలను అందించేవారు. భక్తుల కష్టాలను తీర్చడంలో ఊదీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఊదీ మహిమను వివరించేందుకు హేమాడ్పంత్ తను రాసిన సాయిచరిత్రలో ఒకటికాదు, రెండుకాదు…. ఏకంగా మూడు అధ్యాయాలను కేటాయించారు. వాటిలోంచి కొన్నిముఖ్యమైన ఘట్టాలు…

ఊదీనే కానక్కర్లేదు: ఊదీ అంటే బాబా ధునిలో నిత్యం కాలే కట్టెల బూడిదే కాదు. అవసరమైనప్పుడు బాబాను తల్చుకుని దాల్చినదేదైనా ఊదీ సమానమైన మహిమతో నిండిపోతుంది. బూడిదనే నమ్ముతున్నప్పుడు ఇక అందులో గుణగణాల ప్రస్తావన ఎందుకని ఉంటుంది? అందుకే బాబాభక్తుడైన నారాయణరావు, తన స్నేహితుడు తేలుకాటుతో విలవిల్లాడిపోతున్నప్పుడు గాయం మీద రాసేందుకు ఊదీ కోసం వెతికాడు. కానీ ఎంతకీ ఊదీ కనిపించకపోవడంతో… అగరువత్తి నుంచి రాలిన బూడిదనే ఊదీగా భావించి తన స్నేహితుడి గాయానికి రాశాడు. నారాయణరావు ఇలా బూడిదను గాయానికి అంటించి, అలా చేతిని పైకి తీయగానే నొప్పి మాయమైపోయింది. ఇలాంటి సంఘటనే నానాసాహెబు హయాంలోనూ జరిగింది. నానాసాహెబు ఒకనాడు ఠాణా రైల్వేస్టేషనులో నిల్చొని ఉండగా, తన స్నేహితుని కుమార్తె ప్లేగు వ్యాధితో బాధపడుతున్న కబురు తెలిసింది. వెంటనే రోడ్డు మీద ఉన్న కాస్త మట్టిని తీసుకుని, సాయిని తల్చుకుని, తన ఎదురుగా ఉన్న భార్య నుదుటి మీద రాశారు. అంతే.. ఆ క్షణం నుంచే తన స్నేహితుని కుమార్తెలో రోగలక్షణాలు సద్దుమణిగిపోయినట్లు తెలిసింది.

ఇక జామ్నేర్‌ లీల బాబా మహిమలలోకెల్లా మహిమాన్వితం జామ్నేర్ వృత్తాంతం. బాబా పరమభక్తుడైన నానాసాహెబ్ కూతురు మైనతాయి పురిటినొప్పులతో సతమతమైపోతోంది. తాను ఎంత బాబాభక్తుడైనప్పటికీ, నానాసాహెబ్కు ఆమె స్థితిని చూసి భయం మొదలైంది. అందుకే ఈ పరిస్థితిని స్వయంగానే చక్కదిద్దుదామనుకున్నారు బాబా. శిరిడీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరుతున్న రామ్గీర్బువా అనే భక్తుని చేతికి ఊదీని, హారతి పాటను ఇచ్చి, వాటిని నానాసాహెబుకి అందించమన్నారు.

రామ్గీర్బువా వద్దనేమో నానాసాహెబు ఇంటికి చేరుకునేంత డబ్బు లేదయ్యే! అయినా ఓ ఆగంతుకుడు రామ్గీర్బువాను జలగామ్ నుంచి జామ్నేర్కు తన టాంగాలో తీసుకుని పోవడం; జామ్నేర్ దగ్గరలో రామ్గీర్బువా టాంగాను దిగగానే, అది అదృశ్యం కావడం తరచూ వినే ఘట్టమే! బాబా స్వయంగా పంపిన ఊదీని మైనతాయికి అందించి, హారతిని పాడిన కొద్ది నిమిషములలోనే సుఖప్రసవం జరిగిన వార్త నానాసాహెబ్ చెవినపడుతుంది. ఇంతకీ రామ్గీర్బువాను గమ్యాన్ని చేర్చిన ఆ ఆగంతకుడు ఎవ్వరో, ఆ టాంగా ఎక్కడిదో ఎవ్వరికీ అంతుచిక్కకుండా పోతుంది. ఈ జామ్నేర్ లీల గురించి తరువాత కాలంలో తమిళనాడుకు చెందిన బి.వి. నరసింహస్వామి కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ ఘట్టానికి ప్రత్యక్ష్య సాక్షులైన మైనతాయి, రామ్గీర్బువాలతో మాట్లాడి సచ్చరిత్రలో ఉన్నదంతా నిజమేనని ధృవీకరించారు.

బాబా సచ్చరిత్రలోనూ, ఆయన గురించి ఇతరత్రా ఉన్న సాహిత్యంలోనూ ఇలాంటి మహిమలు అనేకం కనిపిస్తాయి. ఇక భక్తుల వ్యక్తిగత అనుభవాల గురించైతే చెప్పనే అవసరం లేదు. నమ్మినవారికి నమ్మనంత ఆయన మహిమలు. ఊదీ అంటే సాక్షాత్తు ఆయన స్వరూపంగా కూడా కొంతమంది భావిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news