దేవీ శరన్నవరాత్రులకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబయింది. ఇవాళ్టి నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు.
ఇవాళ ఉదయం గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, రుత్విక్ వర్ణం, ప్రాతఃకాల పూజ, అఖండ దీపారాధన, అంకురార్పణ జరిపి కలశ స్థాపన నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ దేవీ నవరాత్రి పూజ చేపట్టి, సప్తశతీ పారాయణం, త్రిశతీ ఖడ్గమాల అష్టోత్తర శతనామార్చన నిర్వహించనున్నట్లు శివాలయం ప్రధాన పూజారి తెలిపారు.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తామని అన్నారు. దేవీ పూజలో పాల్గొనదలిచిన దంపతులు రూ.1,116.., ఒకరోజు సప్తశతీ పారాయణానికి రూ.116 చెల్లించాలని ఈవో గీత తెలిపారు.