ఉద్యోగం కోసం యూరప్ వెళ్లిన తెలుగు యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏమీ తెలియని దేశంలో తిండి లేక రోడ్లు మీద తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యూరప్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని వైజాగ్‌కు చెందిన కొందరు ఏజెంట్లు మోసం చేశారని బాధిత యువకులు ఆ వీడియోలో పేర్కొన్నారు.
రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారని, తిండి లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఉండేందుకు కూడా నివాసం లేక రోడ్డున పడ్డామని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్లకు ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించడం లేదని, తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారని వెల్లడించారు. దయచేసి తమని యూరప్ పంపిన వైజాగ్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని బాధిత యువకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.ఎలాగైనా తమకు సాయం చేసి ఆదుకోవాలని యువకులు వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.