ఈ నెల 16, 17 తేదీల్లో సంభవించనున్న చంద్ర గ్రహణం కారణంగా ఆలయాన్ని మూసేస్తున్నామని తిరుమల దేవస్థానం ప్రకటించింది. అందువల్ల ఆ సమయంలో ఆలయానికి వెళ్లకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజుకు కొన్ని వేలల్లో ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే ఈ సంఖ్య రోజుకు లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలోనే నిత్యం శ్రీవారిని అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటుంటారు. ఇక కొత్తవారైతే తమ కోర్కెలను నెరవేర్చాలని స్వామి వారిని వేడుకుంటారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును తెచ్చుకుంది.
అయితే తిరుమల దర్శనానికి ఎవరైనా.. ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కానీ ఆలయం సూచించిన సందర్భాళ్లో వెళ్లకూడదు. అదేనండీ.. గ్రహణాలు పట్టిన సమయంలో ఆలయం ప్రకటన వెలువరిస్తుంది కదా.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లరాదు. ఈ క్రమంలోనే ఈ నెల 16, 17 తేదీల్లో సంభవించనున్న చంద్ర గ్రహణం కారణంగా ఆలయాన్ని మూసేస్తున్నామని తిరుమల దేవస్థానం ప్రకటించింది. అందువల్ల ఆ సమయంలో ఆలయానికి వెళ్లకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి దాటాక 1.31 గంటలకు చంద్ర గ్రహణం సంభవించనుంది. మరుసటి రోజు అంటే 17వ తేదీ ఉదయం 4.29 గంటల వరకు గ్రహణం ఉంటుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని 16న రాత్రి 7 గంటలకే మూస్తారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఈ క్రమంలో దాదాపుగా 10 గంటల వరకు ఆలయం మూసి ఉంటుంది. అయితే 17వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయాన్ని సుప్రభాతంతో తెరిచాక శుద్ధి చేస్తారు. అనంతరం పుణ్యాహవచనం నిర్వహిస్తారు.
పుణ్యాహవచనం అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించాక ఉదయం 11 గంటలకు మళ్లీ యథావిధిగా దర్శనానికి అనుమతినిస్తారు. కాగా గ్రహణం నేపథ్యంలో 16వ తేదీన స్వామి వారికి జరగాల్సిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మరుసటి రోజు 17వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. ఈ క్రమంలో ఆలయ మూసివేత సమయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆలయానికి రావాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది..!