లోకంలో చాలామంది అనేక రకాల దారిద్య్రాలతో బాధపడుతుంటారు. దారిద్య్రం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం ఇలా రకరకాలైనవి. వీటన్నింటికి శాస్త్రం చెప్పిన పరిష్కారాలు సోమవతీ అమావాస్య. చాలా అరుదుగా వచ్చే వాటిలో సోమవతీ అమావాస్య ఒకటి. సోమవారం నాడు వచ్చిన అమావాస్యను సోమవతీ అమావాస్య అంటారు. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనః కారకుడు. అంతేకాదు శివుని ఝటాఝూటాన ఉంటాడు. అంటే ఐశ్వర్య కారకుడు, ఆరోగ్య ప్రదాత శివునికి ఇష్టమైన రోజు సోమవారం. ఇలాంటి రోజు వచ్చే అమావాస్యనాడు కొన్ని పనులను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తే చాలు తప్పక విశేష ఫలితం వస్తుంది. ఏం చేయాలి ఈ రోజు పరిశీలిద్దాం..
– ఈ రోజున మౌనంగా ఉండి స్నానం చేయడం వలన వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది.
– సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమైన అశ్వత్థ వృక్షం (రావిచెట్టు)ను పూజించడం తర్వాత రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా విశేషం. ప్రదక్షణలు చేసేటప్పుడు ఏవైనా పండ్లను పట్టుకుని ఒక్కో ప్రదక్షణకు ఒక్కో పండును రావిచెట్టు మొదట్లో పెట్టాలి. 108 ప్రదక్షణలు పూర్తయిన తర్వాత వాటిని పుణ్యస్త్రీలకు లేదా బ్రాహ్మణులకు, పేదవారికి పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల సంతానం చిరంజీవులుగా ఉంటారు. పైవేవీ సాధ్యం కానివారు ఇంట్లోనే తులసి చెట్టుకు శుభ్రమైన నీరు పోసి, పసుపు, కుంకుమ వేసి అగరువత్తి వెలిగించి తర్వాత భక్తితో శ్రద్ధతో 108 ప్రదక్షణలు చేస్తే దారిద్య్రం అంతమవుతుందని శాస్ర్తాలలో ఉంది.
మహోదయ మౌని అమావాస్య
పుష్యమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ప్రతినెల రవి, చంద్రులు కలయికతో వచ్చేదే అమావాస్య. అయితే ప్రతినెల ఒక్కోరాశిలో వస్తుంటుంది అమావాస్య. పుష్యమాస అమావాస్య మకరరాశిలో వస్తుంది. ఇక్కడ సూక్ష్మ విషయాలు పరిశీలిస్తే.. మకరరాశి అధిపతి శని, సోమవారానికి అధిపతి చంద్రుడు, అమావాస్య కారకులు రవి, చంద్రులు. వీరి ముగ్గురు మధ్య సంబంధాలను జ్యోతిష పరంగా చూస్తే రవి-శనులు శత్రువులు, చంద్రుడు-శని అంతర్గత శత్రువులు. కాబట్టి ఈ రోజు వచ్చే అమావాస్య నాడు ఎంత తక్కువగా మాట్లాడితే అంతమంచిది అని శాస్ర్తాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా ఈ రోజు వీలున్నవారు సముద్రస్నానం, కుంభమేళా స్నానం ఆచరిస్తే మరీ మంచిది.
అయితే పరస్పర శత్రుత్వం ఉన్న రవి, శని,చంద్రుని కలయికతో వచ్చిన ఈ అమావాస్య సోమవారం, శ్రవణా నక్షత్రంతో వ్యతీపాతయోగంలో వచ్చింది. కాబట్టి దీన్ని మహోదయ అమావాస్య అని వ్యవహరిస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు మనఃధ్యానం, నిరంతర దేవనామస్మరణ, దానాలు, ధర్మాలు ఆచరించడం వల్ల విశేష ఫలితం వస్తుంది. వ్యతిపాత యోగంలో వచ్చే అమావాస్య గురించి నిర్ణయసింధు, ధర్మసింధు వంటి హిందూ గ్రంథాల్లో వివరించారు. ఆయుష్షు కారకుడైన శని అధిపతిగా ఉన్న మకరరాశిలో అమావాస్య కాబట్టి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం రాహుకాలం 7-30 నుంచి 9 గంటల వరకు సాధ్యమైనంత వరకు దేవాలయ దర్శనం, మౌనం, ధ్యానం చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి.
ఇక ఆలస్యం ఎందుకు ఫిబ్రవరి 4 సోమవారం అమావాస్య వచ్చింది. దీన్నే సోమవతీ అమావాస్య అంటారు. ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. భగవంతుని కృపకు పాత్రులుకాండి.
– కేశవ