ఆదిశేషు తోకభాగం ఉన్న ప్రదేశం మీకు తెలుసా ?

-

శ్రీమహా విష్ణువు సకలలోక స్థితికారకుడు . ఆయన పవళించేది ఆదిశేషువుపై. అయితే ఆదిశేషువు తోకభాగం ఉన్నప్రదేశం ఒక మహాక్షేత్రమై అలరారుతున్నది. ఆ క్షేత్రమే అనంతగిరి. ఆ విశేషాలు తెలుసుకుందాం…

అనంతగిరి వికారాబాద్ జిల్లాలోవుంది. వికారాబాద్ కి 5 కి.మీ. లు, హైదరాబాద్ కి సుమారు 90 కి.మీ. ల దూరంలో వుంది. పురాణ ప్రసిధ్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రం నిత్య జీవితంలో పరుగులు పెట్టే మానవాళికి సేదతీర్చే ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్ కూడా. శ్రీ అనంత పద్మనాభస్వామి ఈ ఆవాసం అటవీ ప్రదేశం అవటంవల్ల ప్రకృతి సౌందర్యంతో అలరారుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్టువు పానుపైన ఆదిశేషుని శిరస్సు ఏడుకొండలలోని శేషాద్రి, నడుము భాగము అహోబిలము, తోక భాగమీ అనంతగిరి అని చెప్పబడుతున్నది. అంతేకాదు..హైదరాబాదు ప్రాంతంలో ప్రసిధ్ధికెక్కిన ముచికుందా నది….అంటే మూసీ నది జన్మస్ధానం ఇది.

ఇక్కడ కొండగుహలో వెలిసిన దేవుడు శ్రీ అనంత పద్మనాభస్వామి, దేవేరి శ్రీ మహలక్ష్మి. సాలగ్రామరూపంలో వెలిశాడు. కొన్నివేల సంవత్సారాలకు పూర్వం మృకండ మహర్షి తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారం తర్వాత విధాత సలహా ప్రకారం ఇక్కడ తపస్సు చేశాడు. కలియుగ ప్రారంభమున శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి, అతని కోరికపై అక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడు. ఆ సాలగ్రామానికి ఉదర, ఛాతీ భాగంలో లెక్క పెట్టలేనన్ని చక్రాలు వున్నాయిట. అందుకని ఆ స్వామిని అనంతుడన్నారని అక్కడి పూజారిగారు చెప్పారు. ఆ గుహలోంచి ఒక సొరంగ మార్గమున్నది. ఆ మార్గము కాశీదాకా వున్నదని అంటారు. మార్కండేయ మహర్షి నిత్యం ఆ మార్గం గుండా కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసివచ్చి స్వామిని అర్చించేవాడట.

మార్కండేయ మహర్షి సమయంలోనే ముచికుందుడనే రాజర్షి వుండేవాడు. ఆయన ఒకసారి చాలా సంవత్సరాలు రాక్షసులతో యుధ్ధం చేసి వారిని ఓడించాడు. బాగా అలసి పోయి వుండటంతో భూలోకంలో తాను అలసట తీర్చుకోవటానికీ, సుఖంగా కొంతకాలం నిదురించుటకూ అనువైన ప్రదేశం చెప్పమని ఇంద్రుని కోరాడు. అంతేకాదు, తన నిద్రా భంగము చేసినవారు తన తీక్షణ దృక్కులతో వెంటనే భస్మమైపోయేటట్లు వరాన్నికూడా ఇంద్రుడినుంచి పొందాడు. ఈ రమణీయమైన ప్రదేశానికి వచ్చి ఇక్కడవున్న ఒక గుహలో నిదురించసాగాడు.

ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు కంసవధానంతరం తన రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకమీద దండెత్తివచ్చి, యాదవ సైన్యాన్ని చిత్తుచేసి,. మధురానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శ్రీకృష్ణ బలరాములు అప్పుడు కాల యవనునికి భయపడినట్లు నటించి అతను చూస్తుండగా ఈ ప్రదేశానికి వచ్చారు. కాలయవనుడుకూడా వారిని వెంబడించి ఇక్కడికి వచ్చాడు. అంత వారు శ్రీ కృష్ణుని వస్త్రము నిదురించుచున్న ముచికుందుని మీద కప్పి తాము పక్కకి తప్పుకున్నారు. కాలయవనుడు శ్రీ కృష్ణుని వస్త్రములు చూసి, నిదురించుచున్నది.

శ్రీ కృష్ణుడే అనుకుని ఆతని నిద్రా భంగముగావించెను. నిద్ర మేల్కాంచిన ముచికుందుని తీక్షణ దృక్కులు పడి కాలయవనుడు భస్మమయ్యాడు. అప్పుడు ముచికుందునికి శ్రీ కృష్ణ బలరాములు ప్రత్యక్షముకాగా, ఆయన వారి పాదాలు కడిగి ధన్యుడయ్యాడు. ముచికుందుడు శ్రీ కృష్ణ పాద ప్రక్షాళన చేసిన జలమే జీవనదియై ఆయన పేరుమీద ముచికుంద నదియై కాలక్రమమున మూసీ అయినది. ఇక్కడి పుష్కరిణి పేరు భవనాశని. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రదేశాలు ప్రశాంతంగా, ఆకర్షణీయంగా వుంటాయి. పక్కనే అనంతగిరి అడవులున్నాయి. పచ్చని ప్రకృతి అందాలతో అలరారుతుంది. హైదరాబాద్‌ నుంచి బస్సు సౌకర్యం ఉంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version