కార్తీక పౌర్ణమి అంటేనే చాలు నిండు పున్నమి. పూర్ణ చంద్రడు. ఈ వేళ చంద్రకాంతికితోడు మనదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జ్వాలాతోరణం, కార్తీకదీపోత్సవాన్ని నిర్వహిస్తారు. దీంతో ప్రకృతి అంతా దీపశోభతో మరింత ప్రజ్వలంగా కాంతిమయంగా ప్రకాశిస్తుంది. అయితే చాలామందికి పెద్దప్రశ్న..
ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి…?
ఏడాదంతా ప్రతిరోజు దీపారాధన చేసేవారు మామూలుగానే దీపారాధన చేయవచ్చు. అయితే ఇంట్లో ఎవరో ఒకరు మాత్రమే దీపారాధన చేస్తారు. మిగిలిన వారు అందరూ కేవలం నమస్కారం చేసుకుని వెళ్లిపోతారు. కాబట్టి ఎవరి ఫలితం వారికి రావాలన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ రోజు దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతుంది. అయితే ఎన్ని వత్తులతో.. అనేది ప్రశ్న? మనకు ఏడాదికి 365 రోజులు. ప్రతిరోజుకు ఒక్కటి చొప్పున 365 వత్తులు వెలిగిస్తే మంచిది. ఎందుకంటే ఏరోజైనా దీపం పెట్టని దాన్ని, అశౌచాలు అంటే పురుడు, మృత సంబంధ మైలలు వచ్చినప్పుడు, ఊర్లకు వెళ్లినప్పుడు దీపారాధన చేయం. అలాంటి దోషాలన్నింటిని పోగొట్టుకొవాలంటే తప్పక 365 పత్తితోచేసిన వత్తులను ఇంట్లో తులసి లేదా ఉసిరి లేదా దీవాలయ ప్రాంగణంలో వెలిగిస్తే సమస్త దోషాలు పోవడమే కాకుండా మన ఆంతర్‌శుద్ది కూడా కలుగుతుందని శాస్త్ర వచనం. తప్పక ఇంట్లో అందరూ ఎవరికి వారే 365 వత్తుల దీపారాధన చేయండి. విశేష ఫలితాలను పొందండి. దీపారాధన చేసే సమయంలో కార్తీక దామోదరాయనమః లేదా కార్తీక త్రయంబకేశ్వరాయనమః అని పఠించండి.
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ