ప్రతి దేవాలయంలో నిత్యం ప్రదక్షిణలు చేసే వారిని చూస్తూ ఉంటాం, మనమూ చేస్తూ ఉంటాం. కొందరు నిదానంగా చేస్తుంటే మరికొందరు పరుగుపరుగున ప్రదక్షిణ చేస్తారు. మరికొందరు చేతులు ముకుళిత హస్తాలతో అంటే నమస్కారం పెడుతూ, మరికొందరు చేతులను కిందికి వదిలి స్పీడ్‌గా వాకింగ్ చేసినట్టు చేస్తారు. కానీ శాస్త్రం చెప్పిన విధంగా ప్రదక్షిణలు ఎలా చేయాలో తెలుసుకుందాం..
అలసట లేకుండా, ఏకాగ్రతతో, స్థిరచిత్తంతో, అడుగులో అడుగు వేసుకుంటూ.. నిదానంగా నడవాలని స్మృతి చెబుతుంది. 9 నెలలు నిండిన నిండు గర్భిణీ, జలంతో నిండిన నిండుకుండను తలపై ధరించిన ఓ సతీమణి అలసట లేకుండా ఎలా నడుస్తుందో అలా నడవాలని ప్రదక్షిణా సూత్రం విశదీకరిస్తుంది.
అడుగులో అడుగు వేసుకుంటూ.. అడుగు వెంబడి అడుగును అనుసరిస్తూ.. చేతులను కదిలించకుండా.. నిశ్చలంగా జోడించి.. హృదయంలో భగవంతుని ధ్యానిస్తూ వాక్కుతో స్తోత్రం చేస్తూ ప్రదక్షిణం చేయాలి. దీనినే చతురంగ ప్రదక్షిణం అంటారు. సృష్టి, స్థితి, లయకారకులైన ముగ్గురు మూర్తులైన త్రిమూర్తులను స్మరిస్తూనే చేసే ప్రదక్షిణలు మూడు! పంచభూతాలలోనే పరమాత్మను అన్వేషిస్తూ.. పరంధాముని ఉనికి విశ్వసిస్తూ చేసే ప్రదక్షిణలు ఐదు. ఇక విషయం తెలిసింది కదా.. తెలియక చేసిన తప్పు తప్పుకాదు. తెలిసిన తర్వాత తప్పు చేయకుండా శాస్త్ర వచనం ప్రకారం భక్తి, శ్రద్ధతో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి,. సంఖ్య కాదు శ్రద్ధ ముఖ్యం అని గుర్తుంచుకోండి.
– కేశవ