సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త్వరలో తన మ్యాప్స్ యూజర్లకు ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు తాము వెళ్లాలనుకునే బస్సులు, రైళ్లలో ఎంత రద్దీ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఆర్‌టీసీ బస్సులు, రైళ్లలో ముఖ్యమైన దినాల్లో ఎంత రద్దీ ఉంటుందో అందరికీ తెలుసు. ఇక కొన్ని నిర్దిష్టమైన మార్గాల్లో తిరిగే రైళ్లు, బస్సుల్లోనైతే ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. దీంతో ఆ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు కొన్ని నెలలు లేదా కనీసం కొన్ని రోజుల ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు వాటిల్లో ప్రయాణిద్దామంటే కుదరదు. అయితే ఇకపై ప్రయాణికులకు ఈ కష్టాలు తీరనున్నాయి. అదెలాగో తెలుసా..?
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ త్వరలో తన మ్యాప్స్ యూజర్లకు ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులు తాము వెళ్లాలనుకునే బస్సులు, రైళ్లలో ఎంత రద్దీ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. సీట్లు ఖాళీగా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఖాళీ ఉన్నాయి, నిలబడ వచ్చా, కనీసం నిలబడేందుకు కూడా చోటు లేదా.. వంటి వివరాలను ఆ ఫీచర్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఆయా బస్సులు, రైళ్లలో ఆయా రూట్లలో ప్రయాణించే వినియోగదారుల గూగుల్ మ్యాప్స్ వివరాలను, వాహనాల వివరాలను, ఇతర సమాచారాన్ని విశ్లేషించి గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు మనకు రైళ్లు, బస్సుల్లో ఉండే రద్దీ వివరాలను తెలుపుతుంది.
అయితే ఈ ఫీచర్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా నగరాల్లో అందుబాటులో ఉండగా, మన దేశంలో త్వరలో అన్ని ప్రాంతాల్లోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ యత్నిస్తోంది. దీంతో వాహనాల్లో ఉన్న రద్దీ మేరకు మనం ప్రయాణించాలా, వద్దా.. లేదా వేరే ఏదైనా వాహనంలో వెళ్లాలా.. అన్న నిర్ణయాన్ని చాలా త్వరగా తీసుకుని టైంను, డబ్బును ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ ఫీచర్ భారత గూగుల్ మ్యాప్స్ యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!