మన దేశంలో ఉన్న ఎన్నో పురాతనమైన ఆలయాల్లో కాట్రా వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి. ఇది జమ్మూ కాశ్మీర్‌లో మంచుకొండల నడుమ ఉంటుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఏటా కొన్ని లక్షల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. తమ కోరికలను నెరవేర్చాలని దైవాన్ని కోరుతారు. ఇక అనుకున్నవి నెరవేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆలయాన్ని కొన్ని లక్షల ఏళ్ల కిందటే నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దుర్గా దేవికి ఎంతో మహిమ ఉందని భక్తులు విశ్వసిస్తారు.
వైష్ణో దేవి ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. అయితే మార్చి నుంచి అక్టోబర్ నెలల నడుమ ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు.
వైష్ణోదేవి విగ్రహం ఉన్న చోటుకి వెళ్లాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాలి. అయితే ఆ దూరాన్ని తగ్గించేందుకు మరో రెండు గుహల్లో అధికారులు దారులను ఏర్పాటు చేశారు.
వైష్ణోదేవి ఆలయం ఉన్న కొండ సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది.
వైష్ణో దేవి ఆలయం ఉన్న గుహలు కొన్ని లక్షల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయట. అలాగే సుమారుగా 10 లక్షల ఏళ్ల కిందటే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు.
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుని సూచన మేరకు పాండవులు వైష్ణో దేవిని పూజించారట. అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచారట.
భైరవుడు అనే ఓ రాక్షసున్ని సంహరించిన అనంతరం దుర్గాదేవే వైష్ణో దేవి రూపంలో ఇక్కడ అవతరించిందని చెబుతారు. అలాగే ఆ రాక్షసుడి తల గుహ నుంచి లోయలోకి పడిపోయిందని స్థలపురాణం చెబుతోంది. ఈ క్రమంలోనే రాక్షసుని దేహం కూడా అక్కడే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహలో ఇప్పటికీ ఉంటుందని చెబుతారు. అందుకే ఆలయం సమీపంలో ఉన్న కొన్ని గుహలను ఎప్పుడూ మూసే ఉంచుతారు.
వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే దారిలో ఓ గుహ వద్ద నీరు వస్తుంటుంది. అందులోనే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దేవిని దర్శించుకుంటారు.
వైష్ణో దేవి ఆలయానికి వెళ్లాలంటే కాట్రా అనే ప్రాంతం నుంచి వెళ్లాలి. కాట్రా ఒక చిన్న టౌన్. అక్కడే యాత్రికులు బస చేస్తుంటారు. అక్కడ బస చేసిన అనంతరం దైవ దర్శనం చేసుకుని తిరిగి కాట్రాకు వచ్చి అక్కడి నుంచి సొంత ఊళ్లకు వెళ్తుంటారు.
కాట్రాకు వెళ్లాలంటే విమాన, రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్లవచ్చు. విమానంలో అయితే జమ్మూకు చేరుకుని అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రాకు చేరుకోవాలి. రోడ్డు మార్గంలో అయితే ఢిల్లీ, చండీగడ్, డెహ్రాడూన్, పాటియాలా, అమృతసర్, ధర్మశాల, పఠాన్‌కోట్‌ల నుంచి నేరుగా కాట్రాకు వెళ్లవచ్చు. రైలు మార్గంలో అయితే కోల్‌కతా, పఠాన్ కోట్, అమృతసర్, ఢిల్లీ, చండీగడ్ నుంచి జమ్ముతావి చేరుకోవాలి. ఇక కాట్రా నుంచి కొండ ప్రాంతంలో ఉండే వైష్ణో దేవి ఆలయానికి చేరుకోవాలంటే కాలి నడక మార్గం, గుర్రపు స్వారీ, పల్లకి లేదా హెలికాప్టర్ సర్వీస్‌లలో దేన్నయినా ఉపయోగించుకోవచ్చు.