గణేశుడి అతిథులకు తీపి తినిపించండి!

-

చదువుకోసం, ఉద్యోగం పరంగా కుటుంబానికి దూరంగా ఉండేవాళ్లకు నిజమైన పండుగ వినాయకచవితి అని చెప్పవచ్చు. ఎక్కడున్న ఆరోజు వచ్చి వినాయకుడి పండగను ఇంట్లో వాళ్లతో కలిసి జరుపుకుని మరీ వెళ్తారు. మరి ఇంటికి వచ్చిన పిల్లలకు, బంధువులకు తీపి తినిపించాలని ప్రతీ తల్లి ఆరాట పడుతుంది. కుడుములు, లడ్డులు ఇవన్నీ దేవుని కోసం చేసినవి. పిల్లలకు స్పెషల్‌గా ఏదైనా చేసిపెట్టాలనుకునే వారికి ఈ వంటలు ప్రత్యేకం.

కొబ్బరి రవ్వలడ్డు

కావలసినవి :
బొంబాయి రవ్వ : 2 కప్పులు
ఎండుకొబ్బరి పొడి : 1 కప్పు
యాలకులపొడి : అర టేబుల్ స్పూన్
పాలు : అర కప్పు
నెయ్యి : 3 స్పూన్లు
చక్కెర : ఒకటిన్నర కప్పు
జీడిపప్పు : పావు కప్పు
ఎండుద్రాక్ష : పావు కప్పు

తయారీ :
బొంబాయి రవ్వను పాన్‌లో వేసి స్పూన్ నెయ్యిని చేర్చి దోరగా వేయించాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. రవ్వ మిశ్రమంలో చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి రవ్వలో కలుపాలి. రవ్వ కొంచెం చల్లారాక అందులో మరిగించిన పాలు పోసి ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి రవ్వలడ్డును వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే పిల్లలకూ పెట్టొచ్చు.

గులాబ్‌జామ్ కుల్ఫీ

కావలసిన పదార్థాలు :
చిన్నసైజు గులాజ్‌జామ్‌లు : 12
పాలు : 5 కప్పులు
పాలపొడి : 3 స్పూన్లు
కార్న్‌ఫ్లోర్ : స్పూన్
కండెన్సడ్ పాలు : అర లీటర్
చక్కెర : 1 కప్పు
తయారీ :
నాలుగున్నర కప్పుల పాలను సగం అయ్యేవరకు మరిగించాలి. తర్వాత అరకప్పు పాలలో పాలపొడి, కార్న్‌ఫ్లోర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మరుగుతున్న పాలతో చేర్చి మరో ఐదు నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమానికి కండెన్సడ్ మిల్క్, చక్కెర చేర్చి బాగా కలుపాలి. పదార్థం చిక్కగా అయ్యేవరకూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు గులాబ్‌జామ్‌లు వేసి దించేయాలి. మిశ్రమం బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లో పోసి డీప్ ఫ్రీజర్‌లో 5 గంలపాటు ఉంచాలి. తర్వాత బయటకు తీస్తే కావాల్సిన గులాజ్‌జామ్ కుల్ఫీ రెడీ.

కాజు బర్ఫీ

కావలసిన పదార్థాలు :
జీడిపప్పు : 100 గ్రా.
చక్కెర : 7 స్పూన్లు
కుంకుమపువ్వు : 1 గ్రా.
యాలకుల పొడి, నీరు : తగినంత
తయారీ :
జీడిపప్పును మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని చక్కెర మునిగేంత వరకు నీరుపోసి తీగ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ పాకం వచ్చే వరకూ వేడిచేయాలి. తర్వాత అందులో కుంకుమ పువ్వు వేయాలి. పాకం తయారవుతుండగా యాలకుడి పొడి, జీడిపప్పుపొడి వేసి సన్నని మంట మీద గట్టిపడేంత వరకు కలబెడుతూ ఉండాలి. జీడిపప్పు మిశ్రమం గట్టిపడగానే దించేయాలి. ఇప్పుడు మందపాటి ప్లేటు తీసుకొని దానికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో పరిచినట్టు పోసుకొని కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి. ఇక అంతే.. అందరూ ఎంతో ఇష్టపడే కాజు బర్ఫీ తయరైంది.

Read more RELATED
Recommended to you

Latest news