మూడోరోజు ముత్యాలపందిరిలో శ్రీశ్రీనివాసుడు !

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా నేడు మూడోరోజు అంటే సెప్టెంబర్‌ 21న ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యాల పందిరిలో వాహన సేవలు జరిగాయి. ఆ వివరాలు…

మూడో రోజు- ఇక మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ. ఈ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. యోగశాస్త్రంలో సింహవాహన శక్తిని గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు.. భవబంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగ సాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్రలోని స్వామి రూపం తెలియజేస్తుంది.. ఈ వాహనంపై ఊరేగే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బాధలు, భయాలు దరిచేరవని భక్తుల నమ్మకం.. అంతేకాదు సకల చరాచర సృష్టికి మూలం శ్రీమహావిష్ణువు.. అందువల్లనే బ్రహ్మోత్సవాల్లో ఇలా పక్షులు, జంతువులపై స్వామివారు ఊరేగుతారట.

రాత్రి ముత్యాలపందిరిలో

ఇక మూడో రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగారు. ముత్యపు పందిరి చల్లదనానికి చిహ్నమట.. ముత్యపుపందిరి వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే మనసు నిర్మలమవుతుందని భక్తుల నమ్మకం.

– శ్రీ