తన జీవిత కాలాన్ని ముందే లిఖించుకున్న ఆ ఆలయం

-

కాశ్మీర్‌లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం మార్తాండ సూర్య దేవాలయం. సూర్య భగవానునికి అంకితమివ్వబడిన ఈ మార్తాండ దేవాలయాన్ని క్రీ.శ. 8 వ శతాబ్దిలో కాశ్మీర రాజు ‘లలితాదిత్య ముక్తాపీడుడు’ నిర్మించాడు. కాశ్మీరీ వాస్తు కళకు మచ్చుతునకగా వున్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి, అపురూప అలంకారాలకు ప్రసిద్ధి పొందింది. ఇది కాశ్మీర్‌ లోయలో అనంతనాగ్‌ పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉంది.

కాశ్మీరును పరిపాలించిన కర్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడు అయిన లలితాదిత్య ముక్తాపీడుడు క్రీ.శ. 8 వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. క్రీ.శ. 725-756 సంవత్సరాల మధ్యకాలంలో ఆ ఆలయం నిర్మాణం పూర్తి అయివుండవచ్చు.కల్హణుడు తన గ్రంథం ‘రాజ తరంగిణి’లో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించాడనే తెలిపాడు.

 

అప్పట్లో ఈ ప్రాంతాలను పరిపాలించిన రాజు లెందరో ఈ సూర్య దేవాలయానికి బంగారం, వెండి, వజ్రాలు, కెంపులు, రత్నాలు ఇలా ఎన్నో కానుకలు ఇచ్చారు. వేలాది ఎకరాలను మాన్యంగా అందజేశారు. మార్తాండ సూర్య దేవాలయం, జమ్మూ కాశ్మీర్  దీంతో దేవాలయంలోని ఖజానా ఈ కానుకలతో ఎప్పుడూ నిండుగా కనిపించేది.

 

ఆ కాలంలో ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది. ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని ముస్లిం రాజులు కూలగొట్టారు. భారతదేశం ముస్లిం రాజుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత మార్తాండ సూర్య దేవాలయం పై వారి కన్ను పడింది. షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ (సికిందర్ బుత్షికాన్) ఆదేశాల మేరకు క్రీ.శ. 15 వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు.

 

సికిందర్ తన సైనికుల చేత ధ్వంసం చేయించాడు. దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా కలిసి ఎంతో కష్టపడితే, డెబ్బై శాతం ఆలయాన్ని మాత్రమే కూలగొట్టగలిగారు. అంటే ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతోంది. చివరికి  ఎలాగైనా ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన భాగానికి భారీగా నిప్పు పెట్టారు. ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం దొరికింది.

 

ఆ రాగి ఫలకం లో ఈ ఆలయ జీవిత కాలం రాజు తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను అడుగగా వారు ఈ ఆలయం నిర్మించిన 1100 సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు చేతిలో ఇది ధ్వంసం అవుతుంది  అని రాసి ఉంది. దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.

 

ఈ రాగి ఫలకం విషయం తనకు ముందే తెలిసి ఉంటే , ఈ ఒక్క ఆలయాన్ని కూలగొట్ట కుండా ఉండి ఉంటే  , భారతీయుల యొక్క ఈ శాస్త్రం తప్పని నిరూపించే వాడిని అని సికిందర్ తన సైనికులతో వాపోయాడని చరిత్ర కారులు పేర్కొన్నారు.
ఒకప్పుడు వైభవోపేతమైన మార్తాండ సూర్య దేవాలయం విధ్వంసకాండకు గురికావడంతో శిథిలాలు మాత్రమే నేటికి మిగిలాయి. గుర్తు పట్టలేనంతగా వికృతం చేయబడిన, చెక్కి వేయబడిన, ముక్కలు చేయబడిన శిల్పాలు మాత్రమే గతకాలపు స్మృతి చిహ్నాలుగా మిగిలాయి.
ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశం గా గుర్తించారు. కేంద్ర రక్షిత కట్టడాల జాబితాలో ఈ ఆలయం పేరు కనిపిస్తుంది.  భారత ప్రభుత్వం ఈ స్థలాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version