హిందూ ధర్మశాస్త్రంలో నవరాత్రులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సాధారణంగా మనం జరుపుకునే శరన్నవరాత్రులు, వసంత నవరాత్రుల గురించి అందరికీ తెలుసు. కానీ, అత్యంత శక్తివంతమైనవి, ఆధ్యాత్మికంగా విశేష ఫలితాలనిచ్చేవి ‘గుప్త నవరాత్రులు’. అందులోనూ శ్యామల దేవి (మాతంగి) ఆరాధన చేసే ఈ రోజులు భక్తుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులను తీసుకువస్తాయి. జ్ఞానం కళలు, మరియు వాక్ శుద్ధిని ప్రసాదించే శ్యామల దేవి అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రుల విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం..
శ్యామల దేవి గుప్త నవరాత్రుల విశిష్టత: గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే పూజలు అని అర్థం.ఈ ఏడాది జనవరి 19వ తేదీ సోమవారం మాఘ శుద్ధ పాడ్యమి నుంచి శ్యామలదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమై జనవరి 27న ఈ నవరాత్రులు ముగుస్తాయి. లోక కల్యాణం కోసం, వ్యక్తిగత సాధన కోసం భక్తులు ఈ సమయంలో శ్యామల దేవిని ఆరాధిస్తారు. శ్యామల దేవి సాక్షాత్తు లలితా పరమేశ్వరి యొక్క మంత్రిణి (మంత్రిణి శ్యామల).
ఈమెను పూజించడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు, రాజకీయాల్లో ఉన్నవారు ఈ సమయంలో అమ్మవారిని ఉపాసించడం వల్ల అద్భుతమైన వాక్చాతుర్యం, సృజనాత్మకతను పొందుతారు. జాతకంలో బుధ గ్రహ దోషాలు ఉన్నవారికి ఈ పూజ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఇష్టమైన నీలిరంగు పుష్పాలతో పూజించి, మంత్రానుష్ఠానం చేయడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది.

జీవితంలో కలిగే సానుకూల మార్పులు: శ్యామల దేవి పూజ వల్ల జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక అడ్డంకులు తొలగిపోతాయి. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని కొలిచిన వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి నశించి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఈమెను ‘సంగీత మాతంగి’ అని కూడా పిలుస్తారు కాబట్టి, సంగీత, సాహిత్య రంగాల్లో రాణించాలనుకునే వారికి ఈ కాలం చాలా కీలకం. మానసిక ఒత్తిడితో బాధపడేవారు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడేవారు ఈ పూజ చేయడం వల్ల మానసిక స్థిరత్వాన్ని పొందుతారు. అమ్మవారి కరుణ వల్ల అపారమైన మేధస్సు, ధైర్యం కలగడం ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
భక్తితో, శ్రద్ధతో చేసే ఏ చిన్న పూజ అయినా అమ్మవారికి ప్రీతికరమే. శ్యామల దేవి గుప్త నవరాత్రులు మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే పవిత్రమైన రోజులు. ఆడంబరాల కంటే స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని స్మరిస్తే ఆమె తప్పక మన కష్టాలను తీర్చి సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది అని అంటున్నారు పండితులు.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఈ గుప్త నవరాత్రుల పూజలు లేదా మంత్ర అనుష్ఠానాలు చేసేటప్పుడు అనుభవజ్ఞులైన పండితుల లేదా గురువుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
