ప్రతి సంవత్సరం 15 రోజులపాటు పితృపక్షాలను ఆచరించడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఈరోజులను మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారికి నివాళి అర్పించడానికి అనువైన సమయంగా భావిస్తారు.తర్పణలు ఈరోజుల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ పక్షం కేవలం ఒక సాధారణ కాలం కాదు, ఇది పితృదేవతలకు అత్యంత పవిత్రమైన సమయం. మన పూర్వీకుల ఆత్మకు శాంతి, మోక్షం లభించడానికి ఈ పక్షంలో చేసే కర్మలు ఎంతో ముఖ్యమైనవి. మహాలయ పక్షం యొక్క విశిష్టత దాని వెనుక ఉన్న ఆచారాల గురించి తెలుసుకుందాం..
మహాలయ పక్షం అనేది భాద్రపద మాసం పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉండే 15 రోజులు కాలం ఈ పక్షంలో పితృదేవతలు తమ వారసుల నుండి శ్రాద్ధ కర్మలు, తర్పణలు స్వీకరించడానికి భూమిపైకి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో చేసే కర్మలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే దీనిని పితృపక్షం అని అంటారు.
పితృ రుణాన్ని తీర్చుకోవడం ఈ పక్షంలో చేసే శార్దకర్మ ద్వారా మనం మన పూర్వీకుల పట్ల ఉన్న రుణాన్ని తీర్చుకున్నట్లు భావిస్తారు. ఇక ఈ కర్మలు మన పూర్వీకుల ఆత్మలకు శాంతిని, తద్వారా వారికి స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాయని నమ్మకం. మహాలయ పక్షం పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం వలన మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు.

ఈ ఏడాది పితృ పక్షాలు ఒక విశేషతతో మొదలై ముగియబోతున్నాయి. గ్రహణాల మధ్య జరుగుతున్న ఈ పక్షం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 7, 2025న జరిగే చంద్రగ్రహణంతో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. అనంతరం, సెప్టెంబర్ 21, 2025న సంభవించే సూర్యగ్రహణంతో ఈ పితృ పక్షాలు ముగియనున్నాయి.
సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తిదినాడు శార్దకర్మ చేస్తారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ రోజు కర్మ చేయలేని వారు, తిధి గుర్తులేనివారు, మహళాయపక్షం అమావాస్య రోజున అన్ని పితృ కర్మలను చేయవచ్చు. అందుకే దీనిని సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ పక్షంలో ఎవరైనా చనిపోయిన తిది తెలియకపోయినా, లేదా దూరంగా ఉండి చేయలేని పరిస్థితుల్లో ఉన్న, అమావాస్య రోజున సమస్త పితురులకు తర్పణాలు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
మహాలయ పక్షం పితృదేవతలకు అంకితం చేయబడిన 15 రోజుల పవిత్ర కాలం. ఈ సమయంలో చేసే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు మన పూర్వీకుల ఆత్మలకు శాంతి మోక్షం అందిస్తాయి. ఇది మన పితృణాన్ని తీర్చుకోవడానికి గొప్ప అవకాశం.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం మన సనాతన ధర్మం, పురాణాల ఆధారంగా ఇవ్వబడింది. ఈ కర్మల విధి విధానాలు పద్ధతులు ప్రాంతాన్ని బట్టి లేదా గురువుల బోధనలు బట్టి మారవచ్చు.