ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్‌గా వచ్చే కొన్ని కలలు మిమ్మల్ని బాగా డిస్టబ్ చేస్తాయి. ఆ కలలో టెన్షన్ పడినా, కంగారుపడినా, భయపడినా.. ఆ ఎఫెక్ట్ మీ మీద బాగా ఉంటుంది. ముఖం అంత ఫ్రష్‌గా ఉండదు. అలాగే కలలో ఎవేవో కనిపిస్తుంటాయి. వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీ కలలో కనిపించే ప్రతి వస్తువు, రంగు భవిష్యత్తులో జరగబోయేదానికి సంకేతం అని స్వప్నశాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు మంచివి ఉంటాయి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. కొన్నిసార్లు మనకు కలలో దీపాలు , మంట కనిపిస్తాయి. ఇది కనిపించే విధానాన్ని బట్టి ఆ కళకు అర్థం మారుతుందట. కలలో మండుతున్న లేదా ఆరిపోయిన దీపం కనిపిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా..!
స్వప్న గ్రంధం ప్రకారం.. ఒక వ్యక్తి తన కలలో వెలుగుతున్న లేక మండుతున్న దీపాన్ని చూస్తే అది శుభ సంకేతం. మండుతున్న దీపం స్వప్నంలో కనిపించడం అంటే అది మనకు భవిష్యత్తులో కలగబోయే గౌరవం, ప్రతిష్టకు నిదర్శనమట. కలలో వెలుగుతున్న దీపం కనిపించడం రాజయోగానికి సంకేతం. ఎలా అయితే దీపపు వెలుగు చీకటిని పారద్రోలి కాంతిని పంచుతుందో అదే విధంగా మీ జీవితం నుంచి అపజయం దూరమై విజయం చేరువవుతోంది అని సూచన అని పండితులు అంటున్నారు.
అలాగే ఒక వ్యక్తి తన కలలో మండుతున్న అఖండ జ్యోతిని చూసినట్లయితే ఆ వ్యక్తికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి దీర్ఘాయువుతో ఉంటాడని పెద్దలు చెబుతారు.
ఆరిపోయిన దీపం కనిపిస్తే..
మరి కలలో ఆరిపోయిన దీపం కనిపించినట్లయితే.. దీపం ఆరడం అంటే అశుభ సూచన. ఇలా కలలో ఆరిన దీపం కనిపించినట్లయితే మన సంకల్పశక్తి బలహీన పడుతుంది అని అర్థం. మనం ఏ పనిలో కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు అని ఈ కల సూచిస్తుంది. అంతే కాదు కలలో కనిపించే ఆరిపోయిన దీపం జీవితంలో ఎదురు కాబోయే వైఫల్యాలను , ఆరోగ్య సమస్యలను, కుటుంబ కలతలను సూచిస్తుందట. అందుకే ఇలాంటి పీడ కలలు వచ్చినప్పుడు ఇష్ట దైవ నామస్మరణ వాటి ఫలితాలను చాలా వరకు తగ్గిస్తుందని పండితులు సూచిస్తున్నారు.