మాఘమాసం విదియ నాడు ఇలా చేస్తే ఐశ్వర్యం మీ సొంతం !

పవిత్రమైన మాసాలలో మాఘమాసం ఒకటి. ఈ మాసంలో ఆయా పర్వదినాల్లో కొన్ని ప్రత్యేకమైన పూజలు, దానాలు చేస్తే తప్పక దేవుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది.

మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

నేడు అంటే జనవరి 26 మాఘమాసం శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ చేయాలి. ఇలా చేస్తే సకలదోషాలు పోవడమే కాకుండా ఆ పరమశివుడి అనుగ్రహం కలిగి మీకు ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. తెల్లని పూలు అంటే తెల్లగన్నేరు, తుమ్మిపూలు, తెల్ల జిల్లేడుతో శివున్ని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

– కేశవ