శ్రీ వేంకటేశ్వరుని రూప విశిష్టత మీకు తెలుసా?

-

మాసేన మార్గశిరోహం అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. అలాంటి పవిత్రమాసంలో ఆయన రూపాల్లో ప్రధానమై, కలియుగ నాథుడిగా, దైవంగా అర్చితామూర్తిగా విలసిలుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ మాసంలో విష్ణు సంబంధ గాథలు, అవతార విశిష్టతలు తెలుసుకున్నా, తలుచుకున్నా పాపాలు పోవడమే కాదు, సకల పుణ్యాలు లభిస్తాయి. వేంకటేశ్వరస్వామి గురించి తెలుసుకుందాం.. స్వామి రూపం ప్రత్యేకం. ఆపాదమస్తకం.. అపురూపం. ఒక్క క్షణకాలం స్వామి దర్శనం రోమాంచితం. ఒళ్లు జలదరింపచేయడమే కాకుండా పరవశింప చేస్తుంది. అలాంటి అపురూప మూర్తి ఆత్మజ్ఞాన చిహ్నాలతో అలరారే వేంకటేశ్వరుని తేజోమూర్తి కడు రమ్యం. ఆయన ధరించిన ఆయా వస్తువులు ఇచ్చే సందేశం తెలుసుకుందాం…

హస్తముల ద్వారా – ‘సంసార సాగర సముత్తరణైక సేతో’ అన్నట్లుగా – కుడిహస్తముతో తన పాదములను చూపుతూ, వీటిని శరణువేడితే చాలు, మీ సంసార సాగరాన్ని మోకాళ్ళ లోతుమాత్రమే చేసి సులభముగా దాటిస్తాననే అభయహస్త సందేశం ఇస్తుండగా, ఎడమచేతితో నాభి క్రిందస్థానం చూపిస్తూ, ప్రాణవాయువును నాభి క్రింద నుండి ఊర్ధ్వముఖంగా తీసుకుపోయి సహస్రారంలో ఉన్న పరబ్రహ్మ యందు లయం చెయ్యమన్న సందేశముంది. కుడి హస్తంతో, నా పాదాలను శరణువేడితే ఎడమచేతితో నిను నా అక్కున చేర్చుకుంటానన్న సూచన ఉందని కూడా కొందరు పెద్దల విశ్లేషణ.

శంఖు నామ చక్రములు ద్వారా – శంఖం ద్వారా ఉద్భవించునది శబ్దం. శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమే కాక, విశ్వచైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది. కుడి ప్రక్కగల నామమును సూర్యనాడిగా, ఎడమ ప్రక్కగల నామమును చంద్రనాడిగా, మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెప్తుంటారు. చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది. అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వారార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకి గుర్తు చక్రం.

జ్ఞానమును పొందమని జ్ఞానచిహ్నముగా శంఖమును, మోక్షచిహ్నముగా నామమును, కర్మనాశనశక్తి చిహ్నముగా చక్రమును ధరించి, కర్తృత్వభావం లేకుండా జ్ఞామును పొంది, తద్వారా కుండలినీ జాగృతమొనర్చి మోక్షమును పొందవలేనన్న సందేశం ఈ శంఖు నామ చక్రములలో ఉంది. ప్రతిరోజూ జరిగే వేంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది.తెలుసుకున్నాం కదా అందుకే శ్రీవేంకటేశ్వరుని రూపమే ఆత్మజ్ఞాన ప్రబోధకరం అయ్యింది. వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news