భగవంతుడికి పూజలు చేసే అనేక ఉపచారాలలో హారతి అనేది ప్రతేకమైన ఉపచారము గా హిందువులు నమ్ముతారు.దీనినే నీరాజనం అని కూడా అంటాము .ఇందుకు అనుబంధంగా కీర్తనలు సంగీతం తో భక్తిని తెలుపుతారు. పాటలు, శ్లోకాలు మంత్రాలు చదువుతారు. అనంతరం హారతిని కళ్ళకు అద్దుకుంటారు. పూజ అనంతరం దేవుడి అనుగ్రహం మనపై ఉంటుందని దేవుడి ఆశీర్వచనానికి ప్రతీకగా హారతిని కళ్ళకు అద్దుకుంటారు
హిందూ సాంప్రదాయంలో హారతి ఒక పవిత్రమైన ఆచారం ఇది దేవుని పట్ల భక్తి గౌరవం, మనకి ఉండే ఆధ్యాత్మిక సంబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. హారతి ఇవ్వడం అంటే కేవలం ఒక దీపాన్ని వెలిగించడం కాదు ఇందులో లోతైన ఆధ్యాత్మిక ఆంతర్యం దాగి ఉంది. ఈ ఆచారం భక్తుని మనసు దైవంతో అనుసంధానం చేస్తుంది. అంతరంగంలో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది.
హారతి ప్రాముఖ్యత: హారతి లోని దీపం, జ్ఞానం పవిత్రతకు ప్రతీక. దైవ శక్తిని సూచిస్తుంది దీపం వెలుగు అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. భక్తుల మనసును దైవం వైపు నడిపిస్తుంది అని నమ్ముతారు. హారతిలో ఉపయోగించే కర్పూరం పవిత్రతకు సూచిక. కర్పూరం పూర్తిగా కరిగిపోవడం భక్తుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి దేవుడిలో లీనమయ్యాడు అనే సందేశాన్ని ఇస్తుంది.
ఆధ్యాత్మిక ఆంతర్యం : మనం ఇంట్లో పూజ చేసే పూజ మందిరంలో దీపం వెలిగించి, దేవుని ఎదుట హారతి ఇస్తాము అలాగే దేవాలయంలో భగవంతునికి హారతి ఇస్తాము. హారతి ఇవ్వడం ద్వారా భక్తుడు తన హృదయంలోని భావాలను దేవునికి సమర్పిస్తాడు. ఆధ్యాత్మికంగా ఇక్కడ భక్తుడు తన ఆత్మను దేవుని పాదాలకు అర్పిస్తాడు. హారతి సమయంలో పాడే భక్తి గీతాలు, మంత్రాలు మనసుని ఎంతో శాంతి పరుస్తాయి. ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి భక్తుడు తన లౌకిక బంధాల నుంచి విముక్తి పొంది దేవుని సేవలో మునిగిపోతాడు. ఇలా హారతి ఇవ్వడం ఆధ్యాత్మికంగా భక్తునికి ఉన్న భక్తి భావాన్ని బలపరుస్తుంది.
కర్పూర హారతిలో ఎక్కువ పొగరాదు,అందుకే ఎక్కువ మంది దీనిని ఉపయోగిస్తారు. కొందరు నిప్పులో సాంబ్రాణి వేసి ధూపం కూడా ఇస్తారు. ఉత్తర భారత దేశంలో జయ జగదీశ హరి అనే పాట ఎక్కువగా పడుతూ హారతి ఇస్తారు. ఇక దక్షిణ భారత దేశంలో మంగళం అనే పదంతో వచ్చే పాటలను పాడుతూ హారతి ఇస్తారు.