హిందూ సనాతన ధర్మంలో శివారాధనకు ఉన్న స్థానం ఎంతో విశిష్టం. హిందూ ధర్మంలో శివుడిని అభిషేక ప్రియుడు అంటారు. ఎంతోమంది దేవుళ్ళు ఎన్నో విధాలుగా పూజనందుకుంటున్న, మహాశివుడు మాత్రం అభిషేకాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతుంది. ప్రత్యేకించి శివలింగాభిషేకం అత్యంత పవిత్రమైన పూజా విధానం గా భక్తులు పరిగణిస్తారు. ఇది కేవలం భక్తి భావంతో చేసే ఆచారం మాత్రమే కాదు శాస్త్రపరంగా ఆధ్యాత్మికత, శరీర లాభాలు కలిగించే ముఖ్యమైన ప్రక్రియ. అసలు శివునికి అభిషేకం ఎందుకు అంత ప్రాధాన్యం అనేది ఇప్పుడు చూద్దాం..
అభిషేకం అంటే: అభి అంటే ‘పై’ నుండి ‘షేకం’ అంటే పోయడం అని అర్థం శివలింగంపై పవిత్ర జలాలు పాలు, తేనె, పెరుగు, గంధం, నీరు, గంగాజలం వంటి ద్రవ్యాలను పైనుండి శివలింగం మీదకు పోస్తూ, చేసే పూజను అభిషేకం అంటారు. హిందూ సంప్రదాయంలో కొందరు మంత్రాలతో, కొందరు శాస్త్ర ప్రకారం స్తోత్రాలతో, అభిషేకం చేస్తూ ఉంటారు. కొందరు ఏమీ రాకుండా ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయడం మనము చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా శ్రావణమాసం, కార్తీక మాసలలో శివుడికి అభిషేకం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది.
శాస్త్రాలు చెప్పే ప్రాధాన్యత: మహా శివునికి అభిషేకం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మనసుకి శరీరానికి శాంతి లభిస్తుంది. అభిషేకం సమయంలో జపించే ఓం నమశ్శివాయ మంత్రం ఎంతో ప్రశాంతతను మనసుకు చేకూరుస్తుంది. అంతేకాక ఒకే మంత్రాన్ని ఎక్కువసార్లు జపించడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది.
స్కంద పురాణం ప్రకారం: అభిషేకం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తగ్గుతాయి ఆత్మ శుద్ధి కలుగుతుంది. అంతేకాక మహా శివునికి అభిషేకం ఒక్కొక్క ద్రవంతో చేయడం ఒక్కో విధమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా పాలు, తేనె, నీరు తో అభిషేకం చేయడం ఐశ్వర్యాన్ని సుఖాన్ని పెంచుతాయని నమ్మకం. అలాగే బెల్లంతో నీటిని చేర్చి అభిషేకం చేయడం అనేది రక్తసంబంధీకుల సమస్యలను నివారించడానికి ఉపయోగపడుతుందని చెబుతారు. ఇక అభిషేకానికి ఉపయోగించే పదార్థాలు ప్రకృతి ప్రసాదంగా భావించాలి వాటి ద్వారానే మనం అభిషేకం చేయడం ఎంతో ఉత్తమం. ఇక కొందరు మారేడు దళాల తో,పెరుగు అన్నం, ఫలాలతో అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బలం చేకూరుతుంది. ఇక స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం పవిత్రతకు, పాప విమోచనానికి ప్రతీకలుగా నమ్ముతారు. అలాగే గంగాజలంతో మహాశివునికి అభిషేకం చేయడంవల్ల మోక్ష ప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఆ మహా శివునికి అభిషేకం అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆయన అభిషేక ప్రియుడిగా పిలవడానికి కారణం ఆయన సర్వజీవులకు సమానంగా చూస్తాడు. జలధార శివలింగంపై ప్రవహించడం వలన భక్తుని ప్రేమ భక్తి నేరుగా భగవంతుడికి చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తి భావం ప్రధానంగా ఉంటే ఏ రూపంలో ఏ ద్రవంతో అభిషేకం చేసిన ఆయనకు ప్రీతికరమే. అభిషేకం దగ్గరలోని శివాలయంలో లేదా మన ఇంట్లో అయినా చేసుకొనవచ్చు. ఎక్కడ చేశామన్నది ముఖ్యం కాదు భక్తి ముఖ్యం.