ప్రకృతి అంతా కొత్త చిగుళ్లతో, పసుపు రంగు పూలతో పలకరించే అద్భుతమైన సమయం వసంత పంచమి. దీనిని ‘శ్రీ పంచమి’ అని కూడా పిలుస్తారు. రేపు అనగా జనవరి 23 న ఈ పండుగను జరుపుకుంటాం.. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం? కేవలం రుతువు మారింది అనడానికేనా? కాదు దీని వెనుక సృష్టికి సంబంధించిన ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. శబ్దం లేని లోకానికి స్వరం అందించిన, అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని పంచిన చదువుల తల్లి సరస్వతి ఆవిర్భవించిన మహత్తర ఘట్టం ఇది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మదేవుని సృష్టి, సరస్వతీ ఆవిర్భావం: పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన కొత్తలో అంతా నిశ్శబ్దంగా నిజీవంగా అనిపించింది. సృష్టి ఉంది కానీ అందులో చైతన్యం లేదు, శబ్దం లేదు. తన సృష్టిలోని ఈ వెలితిని గమనించిన బ్రహ్మ, తన కమండలంలోని నీటిని గాలిలోకి చల్లగా.. ఆ జలబిందువుల నుండి శ్వేతవస్త్ర ధారిణియై, చేతిలో వీణ, పుస్తకంతో సరస్వతీ దేవి ప్రత్యక్షమైంది.
బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆమె తన వీణను మీటగానే, ఈ ప్రపంచానికి వాక్కు (శబ్దం) లభించింది. గాలికి సవ్వడి, నదులకు గలగలలు, పక్షులకు కిలకిలరావాలు కలిగాయి. ఆ రోజు మాఘ శుద్ధ పంచమి కావడంతో, అప్పటి నుండి దీనిని వసంత పంచమిగా జరుపుకుంటున్నాము.

శ్రీ పంచమి విశిష్టత, సంప్రదాయాలు: వసంత పంచమిని కేవలం విద్యా దినోత్సవంగానే కాకుండా, సౌభాగ్యానికి ప్రతీక అయిన ‘శ్రీ పంచమి’గా కూడా పిలుస్తారు. ఈ రోజున సరస్వతీ దేవిని పూజించడం వల్ల బుద్ధి వికాసం కలుగుతుందని, కళాకారులకు వాక్శుద్ధి లభిస్తుందని నమ్మకం.
ఉత్తర భారతదేశంలో ఈ రోజును ‘కామదేవ’ పండుగగా కూడా జరుపుకుంటారు, అందుకే దీనిని ప్రేమకు, సృజనాత్మకతకు చిహ్నంగా భావిస్తారు. పసుపు రంగును వసంతానికి గుర్తుగా భావిస్తూ, ఈ రోజున పసుపు వస్త్రాలు ధరించడం, పసుపు రంగు పిండివంటలు నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా వస్తోంది. అక్షరాభ్యాసానికి ఇది అత్యంత ప్రశస్తమైన రోజు కావడం వల్ల చిన్నారుల విద్యా ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది.
