పిల్లల జీవితంలో ఓనమాలు దిద్దించే ‘అక్షరాభ్యాసం’ ఒక మధురమైన ఘట్టం. జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి రోజూ అక్షర శ్రీకారం చుట్టడం అత్యంత శుభప్రదమని మన నమ్మకం. 2026లో జనవరి 23వ తేదీన వచ్చే ఈ పవిత్ర పర్వదినం కోసం తల్లిదండ్రులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. తమ బిడ్డలు విద్యాబుద్ధుల్లో రాణించాలని కోరుకుంటూ ఈ మంగళకరమైన రోజున సరస్వతీ అమ్మవారి సాక్షిగా అక్షర లోకంలోకి వారిని ఆహ్వానించడం ఒక గొప్ప సంప్రదాయం.
2026 వసంత పంచమి ముహూర్తం: హిందూ పంచాంగం ప్రకారం 2026లో మాఘ శుద్ధ పంచమి అంటే జనవరి 23 శుక్రవారం నాడు వసంత పంచమి జరుపుకుంటున్నాము. ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉంటుంది, అంటే రోజంతా శుభ సమయమే. అయినప్పటికీ ఉదయం 7:10 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అక్షరాభ్యాసానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ రోజున బాసర వంటి క్షేత్రాలలో లేదా ఇంట్లోనే అమ్మవారి పూజ చేసి బిడ్డ చేత బియ్యంపై ‘ఓం’ అని రాయించి అక్షరాబ్యాసం చేయిస్తారు. వల్ల వారికి బుద్ధి బలం, వాక్చాతుర్యం సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

విద్యారంభం – తల్లిదండ్రుల బాధ్యత: అక్షరాభ్యాసం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది బిడ్డ ఉజ్వల భవిష్యత్తుకు పునాది. ఈ రోజున చిన్నారులకు కొత్త బట్టలు వేసి, పసుపు, కుంకుమ, పూలతో సరస్వతీ దేవిని ఆరాధించి, గురువుల ఆశీస్సులు తీసుకోవాలి. కేవలం అక్షరాలు నేర్పించడమే కాకుండా, వారిలో పఠనాసక్తిని పెంపొందించేలా ఈ వేడుకను నిర్వహించాలి. జ్ఞానమే అన్నిటికంటే గొప్ప సంపద అని చాటిచెప్పే ఈ వసంత పంచమి, ప్రతి ఇంట్లో విద్యా కాంతులు నింపాలని ఆకాంక్షిద్దాం.
గమనిక: పైన పేర్కొన్న ముహూర్త వివరాలు పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి. మీ ప్రాంతీయ సమయాలు మరియు మీ నక్షత్ర రీత్యా ఖచ్చితమైన సమయం కోసం స్థానిక పురోహితులను సంప్రదించవలసిందిగా మనవి.
