మన బొజ్జ గణపయ్యకు ఏమి ఇష్టమో తెలుసా

-

శివ పూజకు కేవలం నీళ్లు, పూలు సరిపోయినట్లే గణనాథుని పూజించడానికి కూడా ఆకులు, పూలే ఉపయోగిస్తుంటాం. శివుడైనా అభిషేక ప్రియుడు కానీ.. విఘ్ననాథుని పూజించడానికి అది కూడా అవసరం లేదు. అత్యంత సాధారణమైన వాటితోనే సంతృప్తి పొందుతాడీ పార్వతీ తనయుడు. ఏమాత్రం కష్టపడకుండా ఇలా అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో లభించే పదార్థాలతోనే గణపయ్య సంతుష్టి చెందడానికి పురాణపరంగా కొన్ని ఆసక్తికరమైన కారణాలు కూడా చెబుతుంటారు. అలాంటివాటిలో కొన్నిటి గురించి చూద్దాం రండి.

దేవతల్లోకెల్లా తొలి పూజ అందుకునే దైవం మన బొజ్జ గణపయ్య.. ఏ పూజ అయినా.. ఏ కార్యమైనా ఆయనను పూజించడంతోనే ప్రారంభమవుతుంది. దేవతలందరిలోనూ అత్యంత నిరాడంబరుడిగా ఉండే శివుడి కుమారుడిగా ఆయన గుణాలను పుణికి పుచ్చుకున్నాడు గణేశుడు. ఏమాత్రం కష్టపడకుండా అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో లభించే పదార్థాలతోనే గణపయ్య సంతృప్తి చెందుతాడు.

మోదక ప్రియుడు.. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం మోదక్.. ఇదొక్కటే కాదు.. ఆవిరిపై ఉడికించిన వంటకాలంటే ఆ గణనాయకుడికి మక్కువే. వంటకాలన్నింటిలోనూ బియ్యం లేదా బియ్యప్పిండి ఉండాల్సిందే. ఇట్టే శక్తినందిస్తూ.. పొట్టకు మరీ భారంగా అనిపించకుండా, ఆరోగ్యంగా ఉంచుతాయీ పదార్థాలు. బియ్యప్పిండిని ఆవిరిపై ఉడికించినప్పుడు చాలా తక్కువ సమయంలోనే ఈ వంటకాలు పూర్తయిపోతాయి. మోదకాలను వినాయకుడు ఇష్టపడడానికి వెనుక ఓ కథ కూడా ఉందని చెబుతారు. ఓరోజు అరణ్యమార్గంలో ప్రయాణిస్తున్న శివపార్వతులు గణపతితో పాటు అత్రి మహాముని ఇంటికి వెళ్తారు.

ముగ్గురూ ఆకలితో ఉండడంతో అత్రి మహాముని భార్య అనసూయ వారికోసం పంచభక్ష్య పరమాన్నాలను వండుతుంది. బాల గణపయ్య తిన్న తర్వాతే ఆహారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు తల్లిదండ్రులైన శివపార్వతులు. దీంతో వంటకాలన్నీ వడ్డించినా.. వినాయకుడి కడుపు నిండకపోగా ఇంకా కావాలంటూ అడగసాగాడు. ఏదైనా తియ్యని వస్తువు ఆహారంగా ఇస్తే ఆయన కడుపు నిండే అవకాశం ఉందని భావించిన అనసూయ గణపతికి మోదకాలని ఆహారంగా వడ్డిస్తుంది. అందులో ఒక్కటి తినగానే బొజ్జ గణపయ్య కడుపు నిండి తృప్తిగా తేన్చుతాడు. కొడుకు ఆకలి తీరడం చూసిన శివుడి కడుపు కూడా నిండిపోయి ఆయన 21 సార్లు తేన్చాడట. దీంతో గణపయ్యకు ఇష్టమైన పదార్థం మోదక్ అని తెలుసుకున్న పార్వతి తన భక్తులు బొజ్జ గణపతికి ఇలాంటివే 21 అర్పించాలని చెబుతుంది. అలా ఇది ఆయనకిష్టమైన ఆహారంగా మారిందట.

గరిక (దూర్వపత్రం) ఆకులతో పూజలందుకొనే నిరాడంబరుడు గణనాథుడు. షడ్రసోపేతమైన నైవేద్యాల కంటే కేవలం దూర్వ గడ్డిని అర్పించి ఈ దేవదేవుని ప్రసన్నం చేసుకోవచ్చట. దీని వెనుకా ఓ పురాణ గాథ ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు అందరినీ ఇబ్బందులకు గురి చేసేవాడు. దేవతలు కూడా అతడిని చూసి భయపడేవారు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆ రాక్షసుడి నుంచి లోకాన్ని రక్షించేందుకు అతన్ని మింగేస్తాడు గణేశుడు.

అయితే అనలాసురుడు బొజ్జ గణపయ్య పొట్టలో అలాగే ఉండిపోయి కడుపులో విపరీతమైన మంట కలిగేలా చేస్తాడు. తండ్రి చంద్రున్ని గణేషుడి తలపై పెట్టినా, విష్ణువు తన పద్మాన్ని ఇచ్చినా, వరుణుడు వర్షాన్ని కురిపించినా ఆ మంట ఏమాత్రం తగ్గదు. అప్పుడు రుషులందరూ కలిసి 21 గరిక పోచలను ఇవ్వగా దాన్ని ఆరగించిన గణనాథుడి కడుపు ప్రశాంతంగా మారిందట. అందుకే వినాయకుడికి గరిక అంటే ఎంతో ప్రీతి అని భావిస్తారు.

అర్క పుష్పాలు వినాయకుడికి ఖరీదైన పూలు, పూల మాలలు కాదు కానీ గడ్డిపూలంటేనే ఎంతో ప్రీతి. అందులోనూ అర్క పుష్పాలు (జిల్లేడు పూలు) అంటే ఈ దేవదేవుడికి ఎంతో ఇష్టం. ఎక్కడైనా ఇట్టే దొరికే ఈ పూలతో సులభంగా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇవి మనుషులలోని వ్యతిరేక భావాలను తొలగించి మనసుకు ప్రశాంతత కలిగిస్తాయట. అంతేకాదు.. ఈ చెట్టులో ఆరోగ్యానికి ఉపయోగపడని పదార్థం అంటూ ఏదీ లేనే లేదు.

వినాయక పూజలో ఉపయోగించే వాటి వాసన వల్ల కూడా కొన్ని సమస్యలు తగ్గుతాయట. అర్క పుష్ప మాలతో వినాయకుడిని పూజిస్తే ఆరోగ్య సమస్యలు దూరం చేసి, ఆనందకరమైన జీవితాన్ని ఆ పార్వతీ నందనుడు అందిస్తాడని భక్తుల నమ్మకం. ఇవే కాదు.. క్రౌంచ్య పుష్పాలూ (శంఖు పుష్పం) వినాయకుడికి ఇష్టమే. శంఖువు ధ్వని శరీరంలోని చక్రాలను ఉత్తేజితం చేస్తుంది. అందుకే శంఖు ధ్వని అన్నా.. శంఖు పుష్పాలన్నా విఘ్నాధిపతికి ఎంతో మక్కువ.

అరటి పండ్లు ఖరీదైన పండ్లు కూడా వినాయక పూజలో వినియోగించాల్సిన అవసరం లేదు. ఖరీదైన పండ్లు ఎన్ని పెట్టినా.. ఈ గజముఖుడికి ఇష్టమైనది మాత్రం అరటి పండే.. దాంతో పాటు వెలగపండు అంటే కూడా ఆయనకు ఇష్టం. ఇలా సాధారణమైన వాటితోనే పూజించి ఆయన ఆశీస్సులు పొందే వీలుంటుంది. కేవలం అరటి పండే కాదు.. అరటి ఆకులతో పూజించడం కూడా గణనాథుడికి ఇష్టమే. అందుకే చాలామంది వినాయక మండపాలను అరటి ఆకులతో అలంకరిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version