దేవేంద్రుడికి ఒకసారి విపరీతమైన ఆవులింత వచ్చింది. దాని నుండి మత్సరుడు అనే రాక్షసుడు జన్మించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వాడికి శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రమును జపిస్తూ ఆ రాక్షసుడు ఘోరమైన తపస్సు చేశాడు. సంతసించిన భోళా శంకరుడు వాడికి కోరిన వరములు ఇచ్చాడు. శివుని వరబలంతో విజృంభించిన మత్సరాసురుడు లోక విజేత యత్నించాడు. ఈర్ష్య అనే రాక్షస కన్యను వివాహం చేసుకుని విషయప్రియుడు, సుందరప్రియుడు అనే పుత్రులను కూడా కన్నాడు. ఆ తర్వాత లోకం నలుదిక్కులా జైత్రయాత్ర చేసి అందరినీ ఓడించి నానా విధాలుగా హింసించటం మొదలు పెట్టాడు. ఆ బాధలు భరించలేని దేవతలు, మునులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. ఆ స్వామి దేవముని గణానికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు. దేవతలంతా దత్తదత్తమైన ఆమంత్రాన్ని నిష్ఠగా జపించసాగారు. ఎప్పటిలాగే గణాధిపతితో పోరుకు దిగిన మూషికాసురుడు ఈసారి మత్సరాసురుడి సహకారం కోరాడు. మత్సరా!సింహంలా విజృంభించు, ఆ గజముఖుని అణచివేయమన్నాడు.
వెంటనే మత్సరుడు భయంకరమైన సింహరూపం ధరించాడు. దశదిశలు పిక్కటిల్లేలా గర్జించాడు. ఎదురుగా నిలిచిన వక్ర తుండ గణపతి మీదకు దూకాడు. మత్సరాసురుని విజృంభణ చూసిన దేవతలు, మునులు హాహాకారాలు చేశారు. వారి భయాన్ని,ఆందోళనను గమనించిన గణపతి వారిని ఆనందింపచేయటానికి నిశ్చయించుకుని తన రూపాన్ని మత్సరుడు భయకంపితుడు అయ్యేలా భారీగా పెంచాడు. ఆ దేహం నుంచి వెలువడిన అద్భుత కాంతులతో మత్సర సింహం కళ్లు బైర్లు కమ్మాయి. అంతలోనే వక్రతుండ గణపతి తొండం మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో , ఆ రాక్షసుడు ప్రాణభయంతో వణికిపోతూ ‘వక్రతుండా మహాకాయా! కోటి సూర్య సమప్రభా! శరణు శరణు నన్ను నీ దాసునిగా స్వీకరించుమని వేడుకున్నాడు. నేటి నుండి నిన్ను పూజించు భక్తులను మాత్సర్యగుణం బాధించదు. నీవే మత్సరాధిపతివి’ అంటూ ప్రార్థించాడు. అప్పటి నుండి వక్రతుండ మహాగణపతికి ఆ సింహమే వాహనమైంది. మాత్సర్యాన్ని వీడటమే నిజమైన వక్రతుండ గణపతి సేవ అని అంతా గ్రహించారు.
ఏడవనాటి
పూజ వలన
ರಾಜ್ಯಗಣಪತಿ
అనుగ్రహిస్తాడు.