వినాయక నిమజ్జన వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు నిమజ్జనాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘గణేశ్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు 2 గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది. తిరిగి మరుసటిరోజు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు యథావిధిగా నడుస్తాయి. ప్రయాణీకులు మెట్రో సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.