శివునికి రుద్రాక్షకు సంబంధం ఏంటి?..ఏ రుద్రాక్ష దేనికి సంకేతం

-

మహాశివరాత్రి రేపే..హిందువులకు పవిత్రమైన పండగ. ఆ రోజు ఎక్కువ మంది రుద్రాక్షలు ధరిస్తారు. రుద్రాక్ష శివునికి సంబంధించినది.. అందుకే శివరాత్రి రోజున రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. రుద్రాక్ష ధరించడం వల్ల కష్టాలు నశించి.. దుఃఖాలు, గ్రహదోషాలు తొలగిపోయి.. జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తులు అన్నీ లభిస్తాయట అయితే… రుద్రాక్షను ఎవరు పడితే వారు.. ఎప్పుడు పడితే అప్పుడు ధరించడకూడదు.. దానికి కూడా నియమాలు ఉన్నాయి. మనదేశంలో ప్రతీ సంవత్సరమూ 300 నుంచి 500 కోట్ల మేర రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మనం ఈరోజు రుద్రాక్షలు ఎలా పుట్టాయి? ఎన్ని రకాలున్నాయి? వాటి వల్ల ఏం లాభాలున్నాయో చూద్దాం.

రుద్రాక్ష ఎలా పుట్టిందంటే..

పురాణాల ప్రకారం.. శివుడు వెయ్యి సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయాడు. ఒకరోజు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన ముందే ఓ కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుంచే రుద్రాక్ష ఉద్భవించినట్లు పండితులు చెబుతారు. శివుని ఆజ్ఞతో మానవ కల్యాణం కోసం రుద్రాక్ష వృక్షాలు భూమి అంతటా వ్యాపించాయి. ఇదేనట శివునికి రుద్రాక్షకు ఉన్న సంబంధం.

రుద్రాక్షలో రకాలు

రుద్రాక్షలో ఒకటి నుండి 21 ముఖాల వరకు ఉంటుంది. వాటిలో ఏకాదశ ముఖ (11 ముఖాలు) రుద్రాక్ష అత్యంత ప్రసిద్ధ రుద్రాక్షగా పరిగణిస్తారు. రుద్రాక్షలోని కొన్ని ప్రధాన రకాలు..
1. ఒక ముఖి రుద్రాక్ష – శివ రూపం
2. ద్విముఖి రుద్రాక్ష – అర్ధనారీశ్వర రూపం
3. త్రిముఖి రుద్రాక్ష – అగ్ని, ప్రకాశవంతమైన రూపం
4. చతుర్ముఖి రుద్రాక్ష – బ్రహ్మ రూపం
5. పంచముఖి రుద్రాక్ష – కాలాగ్ని రూపం
6. షణ్ముఖి రుద్రాక్ష – కార్తికేయ భగవానుడి రూపం
7. సప్తముఖి రుద్రాక్ష – సప్తఋషుల రూపం
8. అష్టముఖి రుద్రాక్ష – అష్టదేవతల రూపం
9. నవముఖి రుద్రాక్ష- ధనం, కీర్తి, సంపత్తి కోసం
10. దశముఖి రుద్రాక్ష- ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కోసం
11. ఏకాదశ ముఖి రుద్రాక్ష- సుప్రసిద్ధ రుద్రాక్ష, ఆత్మవిశ్వాసం పెంచేందుకు..
12. ద్వాదశ ముఖి రుద్రాక్ష- విజయం కోసం
13. త్రయోదశ ముఖి రుద్రాక్ష- సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం
108 లేదా 54 లేదా 27 రుద్రాక్షలను బంగారం, వెండి, రాగి తీగతో మాలగా తయారుచేయించి శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజ జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో మెడలో ధరిస్తారు. రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. రుద్రాక్షలను అందరూ ధరించవచ్చు. కానీ మద్యపానం, ధూమపానం సమయంలో, నిద్రించేటప్పుడు, అంత్యక్రియల సమయంలో మాత్రం ధరించకూడదని గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version