నాన్న చేసిన గూండాయిజాన్ని దగ్గర నుంచి చూశాను.. అసలు గూండాయిజమంటే.. పేదవాళ్లకు సాయం చేయడమేనని నాన్న చెప్పారు. దాన్నే దగ్గరుండి చూపించారు.. ఎక్కడ గొడవ జరిగినా నన్ను తీసుకెళ్లేవారు. అలా ప్రతీపనికి చిన్నప్పటి నుంచే నేను ప్రత్యక్ష సాక్షిని.. ఇప్పటి వరకు ఆయన వెన్నంటే ఉన్నాను.. ప్రజల కోసం లీడర్‌గా ఎలా బతకాలో కొండా మురళిని చూసే నేర్చుకోవాలి.. అని కొండా దంపతుల కూతురు సుష్మితాపటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న కొండా బయోపిక్ ట్రైలర్‌ను హన్మకొండలోని కొండా నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండా సినిమా నిర్మాత సుష్మితాపటేల్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
తీవ్రమైన కేసులు అమ్మానాన్నపై బనాయించి జీవితఖైదు చేస్తారని కొందరు నాయకులు మాట్లాడుకోవడంతోపాటు తనను అనాథ ఆశ్రమానికి పంపించమని సలహాఇచ్చిన నాయకులను చూశానని ఆమె అన్నారు. అంతగడ్డు పరిస్థితుల్లో కాంగ్రెస్ భవన్‌లో వైఎస్సార్‌తోపాటు మా కుటుంబమంతా నాలుగు రోజులపాటు ఒకేరూములో ఉన్నాం. అప్పుడు వైఎస్సార్ ఎలా కాపాడారో.. నాన్న కూడా ప్రజల కోసం అలాగే పనిచేస్తూ గొప్పలీడర్‌గా ఎదిగారని అన్నారు. ఆడది వంటింటికే పరిమితమని అనుకునే రోజుల్లోనే అమ్మను ముందుండి నడిపించి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే, మంత్రిని చేశారని పేర్కొన్నారు.